తెల్లకార్డులు సరెండర్‌ చేయండి

ABN , First Publish Date - 2021-08-21T08:12:06+05:30 IST

తెల్లకార్డులను సోమవారం లోగా సరెండర్‌ చేయాలంటూ వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులను అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

తెల్లకార్డులు సరెండర్‌ చేయండి

లేదంటే సస్పెన్షన్లు తప్పవు!

వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు 


కలికిరి, ఆగస్టు 20: తెల్లకార్డులను సోమవారం లోగా సరెండర్‌ చేయాలంటూ వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులను అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు 11,107 మందితో జాబితాను పంపిణీ చేసినట్లు సమాచారం. ఆయా ఉద్యోగుల పేరు, ఐడీ సంఖ్య, రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌ కార్డున్న మండలాల వివరాలతో ఈ జాబితాను సిద్ధం చేశారు. నేరుగా ఉద్యోగుల పేర్లతోనే కాకుండా, ఇతర కార్డులో ఉద్యోగి పేరున్నా ఆ రేషన్‌ కార్డును ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉంది. జిల్లాలో అత్యధికంగా తిరుపతి అర్బన్‌లో 960, రూరల్‌లో 325 మంది ఉద్యోగులకు రేషన్‌ కార్డులున్నాయి. మున్సిపాలిటీలపరంగా రూరల్‌తో కలుపుకుని చిత్తూరులో 581 మంది, మదనపల్లెలో 776 మంది, పుత్తూరులో 261 మంది, శ్రీకాళహస్తిలో 389 మంది, నగరిలో 159 మంది, పుంగనూరులో 291 మంది, పలమనేరులో 233 మంది, బి.కొత్తకోటలో 147 మంది, కుప్పంలో 125 మంది తెల్లకార్డులు పొందినట్లు గుర్తించారు. ఇతర మండలాల్లోని వారి జాబితానూ పొందుపరిచారు. 


లబ్ధి పొందిన సొమ్ము రికవరీకి ఆదేశాలు 

సోమవారంలోగా రేషన్‌ కార్డులను సరెండర్‌ చేయకుంటే సస్పెండు తప్పదని జిల్లా అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. దీనికి సంబంధించి కలెక్టరు హరినారాయణన్‌ పేరుతో పౌర సరఫరాల శాఖ కమిషనరు కోన శశిధర్‌ ఈ నెల 9న రాసిన లేఖ (డీవో లెటర్‌) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులో.. వీఆర్వోలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పొందిన 11,107 రేషన్‌ కార్డులపై సమగ్ర విచారణ జరిపించి కార్డులను రద్దు చేయడంతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీని వల్ల ప్రభుత్వానికి వాటిల్లిన నష్టాన్ని వారి నుంచి రికవరీ చేయాలని కూడా సూచించారు. తప్పుడు సమాచారమిచ్చి రేషన్‌ కార్డు పొందినా లేదా ఒక కుటుంబ సభ్యుడిగా చేరినా ఆ ఉద్యోగులపై ఏపీ స్టేట్‌ పీడీ సిస్టమ్‌ కంట్రోల్‌ ఆర్డరు-2018 మేరకు క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. 


ఇతర ఉద్యోగులకూ వర్తించనున్న ఆదేశాలు

రేషన్‌ కార్డులు పొందడానికి గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల నెలసరి ఆదాయ పరిమితిని విధించారు. ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, ఆదాయ పరిమితికి సంబంధించి రూ.10 వేల పైబడి నెలసరి వేతనం పొందుతున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అనర్హుల కిందకు వస్తారు. 2019 నవంబరులో జరిగిన నవశకం సర్వే ద్వారా ఈ వర్గాల్లో కొందరిని గుర్తించి అప్పట్లో రేషన్‌ కార్డులు తొలగించారు. ఆ తర్వవత కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసే క్రమంలో ఈ వర్గానికి చెందిన వారు వేలాదిగా కార్డులు పొందారని ప్రభుత్వం వద్ద సమాచారమున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఏరివేత ప్రారంభిస్తే ప్రస్తుత జాబితాలోని 11,107 మందే కాకుండా కనీసం మరో పదిహేను వేల మంది కార్డులు రద్దు చేసే అవకాశముందని అంటున్నారు. 

Updated Date - 2021-08-21T08:12:06+05:30 IST