చెరకు రైతులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-11-02T06:28:58+05:30 IST

చెరకు రైతులను ఆదుకోవాలి అని సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు.

చెరకు రైతులను ఆదుకోండి
కలెక్టరేట్‌ వద్ద చెరకు గడలతో నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు

సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చేదెప్పుడు?

కలెక్టరేట్‌ ముందు సీపీఐ నేతల వినూత్న నిరసన


చిత్తూరు, నవంబరు 1:జిల్లాలో మూసేసిన చక్కెర మిల్లులను తెరవాలి. పెండింగ్‌లోని బకాయిలను విడుదల చేసి, చెరకు రైతులను ఆదుకోవాలి’ అని సోమవారం సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ముందు చెరకు గడలతో వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు గాజులమండ్యం, చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలను పునఃప్రారంభిస్తానని సీఎం జగన్‌ చెప్పారన్నారు. రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోవడం లేదని వాపోయారు. 30వేల ఎకరాల్లో చెరకు సాగులో ఉందని, టన్నుకు రూ.3500 ఇవ్వాలని కోరారు. నేతలు వీసీ  గోపినాథ్‌, మణి, దాసరి చంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఫ వ్యవసాయ భూమికి వెళ్లే దారిని భూస్వాములు ఆక్రమించారని కార్వేటినగరం మండలం కృష్ణాపురానికి చెందిన రైతు దమర్‌కుమార్‌ ఆరోపించారు. ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. ఫ ఓం శక్తి ఆలయం కట్టుకోవడానికి పెట్టుకున్న ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన ఓ రైతు ఆక్రమించాడని జీడీ నెల్లూరు మండలం కలిజవేడు పంచాయతీలోని కె.నాశంపల్లె ఎస్టీలు ఫిర్యాదు చేశారు. ఫ దళితులకు చెందిన శ్మశాన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐరాల మండలం కామినాయునిపల్లె దళితులు విజ్ఞప్తి చేశారు.  


కలెక్టరేట్‌లో ‘స్పందన’కు 187 అర్జీలు

కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 187 అర్జీలు అందాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. వీటిల్లో.. రెవెన్యూకు 91, డీఆర్‌డీఏకు 35, పౌరసరఫరాలకు 11, సంక్షేమ శాఖలకు 13, ఇతర శాఖలకు సంబంధించి 37 అర్జీలున్నాయి. ఈ కార్యక్రమంలో జేసీలు పి.రాజాబాబు, శ్రీధర్‌, వెంకటేశ్వర్‌, రాజశేఖర్‌, డీఆర్వో  మురళి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:28:58+05:30 IST