గోలీలా.. గుడ్లా..?!

ABN , First Publish Date - 2021-09-03T07:38:35+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు గోలీల్లాంటి గుడ్లను సరఫరా చేస్తున్నారు.

గోలీలా.. గుడ్లా..?!
పెనుమూరు ఉన్నత పాఠశాలకు సరఫరా చేసిన గుడ్లలో చిన్నవిగా ఉన్న 80శాతం గుడ్లు




విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందని పోషకాలు

 కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై దృష్టిసారించని అధికారులు


చిత్తూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు గోలీల్లాంటి గుడ్లను సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై అధికారులు దృష్టి సారించక పోవడం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి. దీనివల్ల విద్యార్థులకు సరైన పోషకాహారం అందడం లేదు. జిల్లాలో 4,900 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మూతపడిన బడులు గత నెల 16న మళ్లీ తెరచుకున్నాయి. రోజుకు సగటున 2.80 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా.. సుమారు 2 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 50 గ్రాములకు పైబడిన గుడ్లను విద్యార్థులకు అందించాలి. కానీ.. 30 నుంచి 35 గ్రాములున్నవే అధికంగా ఉంటున్నాయి. మరికొన్నయితే గోలీలను తలపిస్తున్నాయి. వీటిని వెనక్కి పంపితే.. వేరే గుడ్లు వచ్చేవరకు పిల్లలు నష్టపోతారన్న కారణంతో సర్దుకుపోతున్నామని ఉపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం. జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలుపై తనిఖీలు చేసి నాణ్యమైన గుడ్లు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


50 శాతం వరకు చిన్నవే..

గంగవరం మండలం నల్లగుట్టపల్లె ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ సరఫరా చేసిన గుడ్లలో 50శాతం వరకు చిన్నవి ఉంటున్నాయి. వీటిని వెనక్కి పంపితే పిల్లలకు సకాలంలో గుడ్లను అందించలేమోనన్న కారణంతో సర్దుకుపోతున్నట్లు ఉపాధ్యాయులు అంటున్నారు. వాస్తవానికి కాంట్రాక్టర్‌ ఉపాధ్యాయుల సమక్షంలో గుడ్లను సరఫరా చేయాలి. అప్పుడే సైజు చిన్నగా ఉన్నా, పగిలినా.. మార్పు చేసే అవకాశాలుంటాయి. కానీ.. ఇక్కడ పాఠశాల మూతపడిన తర్వాత వంట మనుషులకు గుడ్లను కాంట్రాక్టర్‌ అప్పగిస్తున్నారు. 


80శాతం చిన్న గుడ్లు 

పెనుమూరు ఉన్నత పాఠశాలలో 689 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఏజెన్సీవారు అందిస్తున్న గుడ్లలో 80శాతం చిన్నవిగా ఉన్నాయి. గతంలో ఇలాంటి గుడ్లను రీప్లేస్‌ చేసేవారు. ఇపుడు అడిగితే.. మాకు ఇవే ఇస్తున్నారని, పైగా బిల్లులు పెండింగులో ఉన్నాయని పంపిణీదారులు సమాధానమిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. 


రోజుకు ఏడు నుంచి పది కుళ్లిపోతున్నాయి 

చౌడేపల్లె మండలం చిన్నకొండామరి ఎంపీపీ పాఠశాలలో 80 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ 15 రోజులకోసారి గుడ్లను సరఫరా చేస్తున్నారు. చాలావరకు 32 నుంచి 34 గ్రాములే ఉంటున్నాయి. పైగా రోజుకు 7 నుంచి 10 గుడ్ల వరకు కుళ్లిపోతున్నాయి. ఇక్కడ కూడా కాంట్రాక్టరు  పాఠశాల అయిపోయాక మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గుడ్లను అప్పగిస్తున్నారు. 


పరిమాణం తగ్గితే బిల్లులు ఆపేస్తాం

పాఠశాలలకు పంపిణీ చేసే గుడ్ల పరిమాణం 45 నుంచి 50 గ్రాములుండాలి. పరిమాణం తగ్గితే ఆ ఏజెన్సీలకు బిల్లులు నిలిపివేస్తాం. గుడ్డు పరిమాణం చూసే బాధ్యత హెచ్‌ఎంలపై ఉంది. వారిచ్చే నివేదికల ఆధారంగానే బిల్లులు మంజూరు చేస్తాం. ఏజెన్సీల గడువు జూన్‌తో ముగిసినప్పటికీ సెప్టెంబరు ఆఖరు వరకు పాత ఏజెన్సీలకే గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

- కృష్ణప్ప, మధ్యాహ్న భోజన పథకం ఏడీ, చిత్తూరు








Updated Date - 2021-09-03T07:38:35+05:30 IST