బావా మరదళ్ల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-29T06:58:59+05:30 IST
హైదరాబాదుకు చెందిన యువకుడు మరదలు (భార్య చెల్లెలు)తో ప్రేమలో పడ్డాడు. తమ పెళ్లి చేయాలంటూ భార్యతో గొడవపడ్డాడు.
అతడి మృతి, బతికి బయటపడ్డ యువతి
భార్య చెల్లెలితో ప్రేమ పర్యవసానం విషాదం
మృతుడిది హైదరాబాదు
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 28: హైదరాబాదుకు చెందిన యువకుడు మరదలు (భార్య చెల్లెలు)తో ప్రేమలో పడ్డాడు. తమ పెళ్లి చేయాలంటూ భార్యతో గొడవపడ్డాడు. చివరకు మరదలితో కలిసి తిరుపతికి చేరుకున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వీరిద్దరు ఆత్మహత్యకు యత్నించగా.. అతడు మృతిచెందాడు. దీనికి సంబంధించి ఈస్ట్ ఎస్‌ఐ జయస్వాములు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయినవీన్ (26)కు, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన యువతితో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కొన్నాళ్ల కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇదిలా ఉండగా.. తన మరదలితో సాయినవీన్ ప్రేమలో పడ్డాడు. ఆమెనిచ్చి పెళ్లిచేయాలంటూ భార్యతో గొడవ పడేవాడు. ఈ వ్యవహారం శ్రుతిమించడంతో ఆమె తల్లిదండ్రులు, తమ చిన్న కుమార్తెను తీసుకుని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు వచ్చేశారు. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్యతో గొడవ పడుతుండగా.. ఆమె తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పది రోజుల కిందట అల్లుడిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు విచారిస్తుండగానే అతడు తన మరదలిని తీసుకుని సోమవారం తిరుపతికి వచ్చాడు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని బస చేశారు. ఈ విషయం తెలిసి వీరితో మాట్లాడేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ బుధవారం రాత్రి లాడ్జిలోని బాత్రూమ్‌లో సాయినవీన్ ఉరేసుకోగా.. అతడి మరదలు నిద్ర మాత్రలు మింగింది. గురువారం స్పృహలోకి వచ్చిన ఆమె.. లేచి చూడగా సాయినవీన్ మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బందికి చెప్పడంతో వారు ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఎస్‌ఐ జయస్వాములు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమాత్రలు మింగిన యువతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు.