మ్యాన్‌హోల్లో పడి గల్లంతైన సుబ్బారావు మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-11-28T07:19:11+05:30 IST

తిరుపతి లక్ష్మీపురం కూడలిలో మ్యాన్‌హోల్లో పడి గల్లంతైన గోపరాజు వెంకటసుబ్బారావు (56) మృతదేహం కొరమేనుగుంట వద్ద శనివారం లభ్యమైంది.

మ్యాన్‌హోల్లో పడి గల్లంతైన సుబ్బారావు మృతదేహం లభ్యం
మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు

సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ముస్లిం జేఏసీ


తిరుపతి(నేరవిభాగం), నవంబరు 27: తిరుపతి లక్ష్మీపురం కూడలిలో మ్యాన్‌హోల్లో పడి గల్లంతైన గోపరాజు వెంకటసుబ్బారావు (56) మృతదేహం కొరమేనుగుంట వద్ద శనివారం లభ్యమైంది. భారీ వర్షాల కారణంగా ఈనెల 18వ తేదీన తిరుపతి నగరం జలమయమైంది. అదేరోజున విధులు ముగించుకుని నడిచి ఇంటికి వస్తున్న సమయంలో సుబ్బారావు లక్ష్మీపురం కూడలిలోని మ్యాన్‌హోల్లో పడి గల్లంతయ్యారు. ఆయనకోసం రాత్రంతా గాలించిన కుటుంబీకులు ఈనెల 19వ తేదీన ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈనెల 21వ తేదీ నుంచి ఈస్ట్‌ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా కాల్వ కాంక్రీట్‌ను పగులగొట్టి పరిశీలించినా ఆచూకీ లభించలేదు. తిరుపతి పర్యటనకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు కూడా సుబ్బారావు ఇంటికివెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. ఇదిలా ఉండగా.. కొరమేనుగుంటలో చేపలు పట్టడానికి వెళ్లిన కొంతమందికి శనివారం మధ్యాహ్నం చెరువు ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ, ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరికృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, తిరుపతి ముస్లిం జేఏసీ ప్రతినిధులు ఎస్‌కే బాబు, జేఎండీ బాషా, మున్సిపల్‌ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండటంతో మున్సిపల్‌ అధికారులు ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చి, అతికష్టంపై మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే, ముస్లిం జేఏసీ ప్రతినిధులు మృతదేహాన్ని మోసుకొచ్చి అంబులెన్స్‌లోకి చేర్చారు. సుబ్బారావు కుమారుడు సాయిసతీష్‌ తన తండ్రి మృతదేహాన్ని గుర్తించడంతో ఎస్వీ మెడికల్‌ కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబీకులకు అప్పగించారు. 


క్షేమంగా ఉంటారనుకున్నాం

‘మ్యాన్‌హోల్లోపడి గల్లంతై పది రోజులు కావస్తుండటంతో ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారనుకున్నాం. త్వరలోనే తిరిగి వస్తారని ఆశలు పెట్టుకున్నాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. వీరిని ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర మున్సిల్‌ అధికారులు ఓదార్చి, ఽధైర్యం చెప్పారు. అలిపిరి సీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 





Updated Date - 2021-11-28T07:19:11+05:30 IST