బలమైన క్యాడర్..బలహీనంగా నాయకులు
ABN , First Publish Date - 2021-10-29T07:28:02+05:30 IST
టీడీపీ ఆవిర్భవించింది మొదలు ఇప్పటి దాకా కుప్పంలో టీడీపీ మినహా మరో పార్టీ జెండా ఎగిరింది లేదు. ప్రత్యేకించి 1989లో చంద్రబాబు రాకతో ఇక్కడ టీడీపీ మరింత బలపడింది.
టీడీపీ ఆవిర్భవించింది మొదలు ఇప్పటి దాకా కుప్పంలో టీడీపీ మినహా మరో పార్టీ జెండా ఎగిరింది లేదు. ప్రత్యేకించి 1989లో చంద్రబాబు రాకతో ఇక్కడ టీడీపీ మరింత బలపడింది. ఆయనపై పోటీ చేసి గెలవడం అసాధ్యమని ఇతర ప్రధాన రాజకీయ పక్షాలు కుప్పం నియోజకవర్గాన్ని మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం కుప్పం ప్రాంతంపై చంద్రబాబు పెట్టిన శ్రద్ధ. పనిష్మెంట్ ఏరియాగా పేరుపడిన మారుమూల నియోజకవర్గాన్ని చంద్రబాబు పర్యాటక ప్రాంతంగా మార్చేశారు. మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్య సౌకర్యాలపరంగా రూపురేఖలు మార్చారు. అభివృద్ధికి నమూనాగా రాష్ట్రం ముందు నిలిపారు. ఇక ఇరుకు రోడ్లతో వున్న చిన్నపాటి కుప్పం పట్టణాన్ని నగరానికి దీటుగా అభివృద్ధి చేశారు. దానికనుగుణంగానే టీడీపీ కూడా ఇక్కడ బలపడుతూ, స్థిరపడుతూ వచ్చింది. రాష్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. అభివృద్ధికి కుప్పం అనాథగా మిగిలింది. గత ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గానికి రూ. 1800 కోట్లతో చంద్రబాబు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. వీటిలో 65 శాతం పూర్తయ్యాయని అంచనా. ఆ దశలో ప్రభుత్వం మారింది. దీంతో మిగిలిన 35 శాతం పనులు పెండింగ్‌లో పడిపోయాయి. నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. అయితే వీటికోసం పోరాడి, ప్రజల ముందు వైసీపీ వివక్షను ఎండగట్టే స్థానిక నాయకత్వం కొరవడింది. టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసు కేసులు నమోదవుతున్నాయి. వేధింపులు, దాడులు పెరిగాయి. ఈ సమయంలో కార్యకర్తలకు అండగా నిలవడంలో నాయకులు విఫలమవుతున్నారనే అసంతృప్తి ఉంది. పార్టీ అధినేతగా, సీఎంగా, ప్రతిపక్షనేతగా రాష్ట్ర బాధ్యతలతో సతమతమయ్యే చంద్రబాబు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించారు. వారు కార్యకర్తలకు అందుబాటులో ఉండి, అండగా నిలబడలేకపోతున్నారనే విమర్శలున్నాయి.నియోజకవర్గంలో సమస్యల మీద పోరాడే తత్వం కొరవడింది. ఈ కారణాలతో ఈ ఏడాది జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ కుప్పంలో పాగా వేసిందంటున్నారు. రెండు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబు వీటిని దృష్టిలో పెట్టుకుంటారని, పార్టీ పటిష్టపడడానికి తగిన దిశానిర్దేశం చేస్తారని కార్యకర్తలు ఆశిస్తున్నారు.
కుప్పం ఒక్కటే కాకుండా జిల్లాలోని పలు ఇతర నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఇన్‌ఛార్జి ఏఎస్ మనోహర్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఇప్పటికీ ఎవరినీ ఇన్‌ఛార్జిగా నియమించలేదు. అలాగే పూతలపట్టు ఇన్‌ఛార్జి లలితకుమారి రాజీనామాతో ఏర్పడిన నాయకత్వ శూన్యత ఇప్పటికీ భర్తీ కాలేదు. తంబళ్ళపల్లె పరిస్థితి మరీ దారుణంగా వుంది. అక్కడ నాయకత్వమే లేదు. జీడీనెల్లూరులో నాయకత్వ సమస్య ఏర్పడడంతో ఇటీవలే సమన్వయకర్తను నియమించారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే స్పష్టత ఇచ్చి ఇన్‌ఛార్జిగా నియమిస్తేనే ఎన్నికల నాటికి వారు బలపడతారని క్యాడర్ భావిస్తోంది. పుంగనూరుకు ఇటీవలే కొత్త నాయకుడిని ప్రకటించినా అక్కడా ముఖ్యనేతల నడుమ ఇంకా సర్దుబాట్లు, సఖ్యతా నెలకొనలేదు. సత్యవేడులో ఇన్‌ఛార్జి ఎవరన్న దానిపై స్పష్టత లేదు. తిరుపతిలోనూ బలమైన నాయకత్వం అవసరమన్న భావన పార్టీ వర్గాల నుంచీ వ్యక్తమవుతోంది. వీటిపై కూడా అధినేత దృష్టి సారించి వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగం బలపడుతుందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
నేడు కుప్పం బస్టాండులో చంద్రబాబు సభ
కుప్పం రూరల్, అక్టోబరు 28 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం రానున్నారు.బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం ఒంటి గంటకు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహం చేరుకుంటారు.2గంటలకు కార్యకర్తలతో కలసి ర్యాలీగా కుప్పం బస్టాండు వద్దకు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు.5.15 గంటలకు వడ్డిపల్లెను సందర్శిస్తారు.6.15 గంటలకు టీడీపీ కార్యాలయంలో మున్సిపాలిటీ వార్డు ఇన్‌చార్జులతో సమావేశమవుతారు. రాత్రి 7.30 గంటలకు అతిఽథి గృహం చేరుకుని అక్కడే బస చేస్తారు.
ఉత్సాహంలో క్యాడర్
జిల్లాలో రెండేళ్లకు పైగా స్తబ్దుగా వుండిపోయిన టీడీపీ శ్రేణులు ఇపుడిపుడే పుంజుకుంటున్నాయి. మంగళగిరిలో ఇటీవల టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై జిల్లా పార్టీ శ్రేణులు స్పందించిన తీరు గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. నాయకులతో పాటూ కార్యకర్తలు కూడా ఆవేశంగా రోడ్లపైకి వచ్చారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. ఆశ్చర్యకరంగా సరైన నాయకత్వం లేని నియోజకవర్గాల్లో కూడా ఈ వాతావరణం కనిపించింది. పోలీసు అడ్డంకులను కూడా లెక్క చేయకుండా చాలాచోట్ల కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు ముందుకొచ్చారు. క్షేత్రస్థాయిలో బలం గా వున్న క్యాడర్‌కు కొంచెం ధైర్యం ఇచ్చే నాయకత్వం వుంటే చాలు జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యం అనే నమ్మకం కలుగుతోందని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.