కొవిడ్‌ మూడోదశను సమర్థంగా ఎదుర్కొనేందుకు కృషి చేయండి

ABN , First Publish Date - 2021-07-08T08:11:39+05:30 IST

కొవిడ్‌ ఒకటి, రెండు దశల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యులు కృషి చేయాలని సహాయక కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ కోరారు.

కొవిడ్‌ మూడోదశను సమర్థంగా ఎదుర్కొనేందుకు కృషి చేయండి
డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మను సత్కరిస్తున్న డాక్టర్లు

అవగాహన సదస్సులో సహాయక కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ 


తిరుపతి సిటీ, జూలై 7: కొవిడ్‌ ఒకటి, రెండు దశల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మూడో దశను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యులు కృషి చేయాలని సహాయక కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ కోరారు. తిరుచానూరులోని ఎడిఫై ఆడిటోరియంలో బుధవారం  కొవిడ్‌ మూడోదశ సంసిద్ధతపై వైద్యులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసారి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కొవిడ్‌ ప్రభావాన్ని తగ్గించేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మూడో దశలో చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉంటుందన్న నిపుణుల అంచనా నేపథ్యంలో.. వారి రక్షణకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. 0-5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించాలని డీఎంహెచ్‌వో శ్రీహరి అన్నారు. కొవిడ్‌ రెండో దశలో ముందే ముప్పును గుర్తించలేక ఊహకు అందని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ అభిప్రాయపడ్డారు. మూడో దశలో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టి కలసికట్టుగా కొవిడ్‌ను ఎదుర్కోవాలన్నారు. కొవిడ్‌ ప్రభావం, శరీరంలో ఎదరయ్యే పరిణామాలు, దీనిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు విభాగాలకు చెందిన వైద్యులు ప్రసంగించారు. మాస్కుల ను వాడే విధానం గురించి డాక్టర్‌ మోహన్‌ వివరించారు. ఊపిరితిత్తులపై కొవిడ్‌ ప్రభావం ఎలా ఉంటుంది, చేపట్టాల్సిన జాగ్రత్తలపై పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ సుబ్బారావు అవగాహన కల్పించారు. చిన్న పిల్లలపై కొవిడ్‌ మూడో దశ ఎలా ఉంటుంది, దానిని ఎదుర్కొనేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను రుయా చిన్నపిల్లల విభాగాధిపతి జయచంద్రనాయుడు తెలిపారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన వైద్యులను, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మను డీఎంహెచ్‌వో శ్రీహరి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌ అధికారి డాక్టర్‌ కృష్ణప్రశాంతి, పీవోడీటీ రమాదేవి, రుయా సూపరింటెండెంట్‌ భారతి, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రవిరాజు, హేమలత, లక్ష్మి, రుయా, పలు ప్రాథమిక ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-08T08:11:39+05:30 IST