పాపం పసివాడు

ABN , First Publish Date - 2021-10-25T05:52:06+05:30 IST

పశువులను మేతకు తీసుకెళ్లిన ఓ విద్యార్థి పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు.

పాపం పసివాడు
గురుకిరణ్‌ (ఫైల్‌ ఫొటో)

పశువులను మేతకు తీసుకెళ్లి.. పిడుగుపాటుతో విద్యార్థి మృతి 


శ్రీకాళహస్తి, అక్టోబరు 24: పశువులను మేతకు తీసుకెళ్లిన ఓ విద్యార్థి పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన ఆదివారం శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. వివరాలివీ.. మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన కప్పల వెంకటరమణయ్య, సుబ్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో చిన్నకుమారుడు గురుకిరణ్‌(14) శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. ఇతడి అమ్మమ్మ సుబ్బమ్మ పశువులను మేత కోసం తీసుకు వెళ్తుండగా, తల్లి సూచనతో తానూ ఆమెకు తోడుగా వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో వీరిద్దరూ గ్రామ సమీపంలో ఉండగా, జోరువాన మొదలైంది. దీంతో గురుకిరణ్‌ పరుగులు తీస్తూ అక్కడున్న వేపచెట్టు కిందికి చేరాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద గొడుగు ఉండడంతో, సుబ్బమ్మ వారితోపాటు ఉండిపోయింది. ఈ నేపథ్యంలో గొడుగు కిందికి రావాలని అందరూ కేకలు వేశారు. అప్పటికే ఒకే గొడుగు కింద ముగ్గురు ఉండటంతో తాను సరిపోనంటూ చెట్టుకిందే నిలబడ్డాడు. అదే సమయంలో ఒక్కసారిగా వేపచెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే గురుకిరణ్‌ మృతిచెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన మృతుడి అమ్మమ్మ, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకుని అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా తండ్రీ.. అంటూ భోరున విలపించడం అందరినీ కలచివేసింది. 

Updated Date - 2021-10-25T05:52:06+05:30 IST