ఇద్దరు యువకులకు కత్తిపోట్లు

ABN , First Publish Date - 2021-06-21T06:37:47+05:30 IST

పాత కక్షలతో ఐదుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు.

ఇద్దరు యువకులకు కత్తిపోట్లు

పాత కక్షలే కారణం

పరారీలో ఐదుగురు నిందితులు 


తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 20: పాత కక్షలతో ఐదుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో.. ఆ ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. అలిపిరి ఎస్‌ఐ మధు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం బీటీఆర్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ యువరాజు, స్టఫ్‌ రాజ, మహేష్‌, అఖిల్‌, నారా చంద్రబాబు కాలనీకి చెందిన చంద్రడు స్నేహితులు. వీరు మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి, తిమ్మినాయుడుపాళ్యంకు చెందిన ఆటోడ్రైవర్‌ సాయికుమార్‌ (24)కు మధ్య పాత గొడవలున్నాయి. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి మంగళం క్వార్టర్స్‌ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌ సమీపంలో సాయికుమార్‌, తన స్నేహితుడు లోక కూర్చొని ఉండగా.. యువరాజు, స్టఫ్‌ రాజ, మహేష్‌, అఖిల్‌, చంద్రుడు అక్కడికి వచ్చారు. వచ్చీ రావడంతోనే సాయికుమార్‌, లోకాతో గొడవకు దిగారు. సాయికుమార్‌ను యువరాజు, మహేష్‌, అఖిల్‌, చంద్రుడు పట్టుకోగా.. స్టఫ్‌ రాజ తనవద్ద ఉన్న కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో సాయికుమార్‌ కుడి భుజంపై రెండు కత్తిపోట్లు పడ్డాయి. అడ్డుకోబోయిన లోకా కడుపులోనూ కత్తితో పొడిచారు. వారిద్దరూ కిందపడి పోవడంతో ఐదుగురు నిందితులు పరారయ్యారు. సాయికుమార్‌, లోక తమ స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదివారం అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-06-21T06:37:47+05:30 IST