ఆన్లైన్లో ముక్కంటి సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-05T15:27:59+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం..

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ ఉధ్రుతి దృష్ట్యా ఇప్పటికే ముక్కంటి దర్శన వేళలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి రాలేని భక్తుల కోసం ఆలయ అధికారులు మంగళవారం నుంచి ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఇందుకు ఆలయంలోని అలంకార, రాయలవారి మండపాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు.. గోపూజ, శ్రీస్వామి పూజ, జ్ఞానప్రసూనాంబ అర్చన, సహస్ర నామార్చన, నిత్య కల్యాణోత్సవం, మృత్యుంజయస్వామి అభిషేకం, మృత్యుంజయ జపం, స్వర్ణ పుష్పార్చన, చండీహోమం, రుద్రహోమం, మహాన్యాస రుద్రాభిషేకం, రాహు-కేతు పూజలను ఆన్లైన్ ద్వారా భక్తులు వీక్షించవచ్చు. అయితే ముక్కంటి సేవలకు సంబంధించి భక్తులు నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. ఇందుకు నెం.08578-222240ను సంప్రదించాలని సూచించారు.