బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల కోసం ప్రత్యేక వార్డు

ABN , First Publish Date - 2021-05-30T06:24:52+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు స్విమ్స్‌, రుయా, సీఎంసీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల కోసం ప్రత్యేక వార్డు

తిరుపతి సిటీ, మే 29: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండడంతో ఈ వ్యాధి బారినపడ్డ వారికి చికిత్స అందించేందుకు స్విమ్స్‌, రుయా, సీఎంసీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఆయన స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ,  రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భారతిలతోపాటు ఆప్తమాలజి్‌స్టలతో బ్లాక్‌ ఫంగస్‌పై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్‌ వ్యాధి ఉన్న వారు, హోం ఐసోలేషన్‌లో ఉండి అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారు అధికంగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నట్లు వైద్యుల నివేదికలో తేలిందన్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి కొవిడ్‌, సాధారణ రోగుల మధ్య చికిత్స అందించకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు. అలాగే వార్డులో ఆక్సిజన్‌ కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొవిడ్‌ బారినపడి డిశ్చార్జ్‌ అయ్యేవారికి బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి గురించి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తలనొప్పి, కంటి నొప్పి, ముఖం మీద ఎటువంటి నొప్పులు వచ్చినా వెంటనే ఆప్తమాలజిస్టులను సంప్రదించేలా బాధితులకు అవగాహన కల్పించాలన్నారు.  కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T06:24:52+05:30 IST