సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-12-09T06:31:08+05:30 IST

సచివాలయాల ద్వారా ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సచివాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు.

సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం
పెద్దపాళ్యంలో సచివాలయ సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

 కలెక్టర్‌ హరినారాయణన్‌


ములకలచెరువు, డిసెంబరు 8: సచివాలయాల ద్వారా ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం సచివాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సచివాలయ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలన్నారు. సమయ పాలన పాటించాలన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను తిప్పుకోకుండా వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్‌కు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్‌ లబ్ధిదారుల జాబితాతో పాటు అనర్హుల లిస్టును కూడా ప్రదర్శించాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పఽథకాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రామానాయునికోట సమీపంలో వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. నీటి ప్రవాహం తగ్గినందున వెంటనే మరమ్మతులు చేపట్టాని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ సాయిలీలతో పాటు పలువురు మండల స్ధాయి అధికారులు ఉన్నారు.

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: కలెక్టర్‌

తంబళ్లపల్లె: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కాజ్‌వేల వద్ద ప్రమాదాలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, రోడ్డుపై నీటి ప్రవాహం తగ్గిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె మండలంలో వర్షాలకు నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. తొలుత, చిన్నేరు ప్రాజెక్టు మొరవ నీటి ప్రవాహ ఉధృతికి దెబ్బతిన్న వేపలపల్లె బ్రిడ్జిని పరిశీలించారు. వాగులో నీటి ప్రవాహం తగ్గడంతో రెండు రోజుల నుంచి గ్రామస్తులు బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తున్నట్లు తహసీల్దారు భీమేశ్వరరావు చెప్పారు. అయితే ప్రమాదాలు సంభవించకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం గుండ్లపల్లె పంచాయతీలో వర్షాలకు దెబ్బతిన్న టమోటా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... తఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను ఆర్బీకే కేంద్రాల్లో ప్రదర్శించామని,  పరిశీలించుకోవాలన్నారు. అనంతరం తంబళ్లపల్లె-మొలకలచెరువు రహదారిలో కొట్లపల్లె వద్ద పెద్దేరు ప్రవాహానికి దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. కార్యక్రమంలో  ఎంపీడీవో దివాకర్‌రెడ్డి, ఏవో లీలాకుమారి, ఎస్‌ఐ సహదేవి, ఉద్యానవన శాఖ అధికారి సౌజన్య, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  Updated Date - 2021-12-09T06:31:08+05:30 IST