సాయంత్రం 7గంటలకే షాపుల మూసివేత

ABN , First Publish Date - 2021-04-23T07:03:06+05:30 IST

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ మొట్టమొదటి లక్ష్యం, ప్రాధాన్యత కొవిడ్‌పై పోరు సాగించడమేనని మేయర్‌ డాక్టర్‌ శిరీష స్పష్టం చేశారు

సాయంత్రం 7గంటలకే షాపుల మూసివేత
-మేయర్‌ శిరీషతో ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, కమిషనర్‌ గిరీష


 తిరుపతి కార్పొరేషన్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం పిలుపు

మార్కెట్ల వికేంద్రీకరణపై ఏకగ్రీవ తీర్మానాలు

తిరుపతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ మొట్టమొదటి లక్ష్యం, ప్రాధాన్యత కొవిడ్‌పై పోరు సాగించడమేనని మేయర్‌ డాక్టర్‌ శిరీష స్పష్టం చేశారు.గురువారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ తొలి సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా వుండడంతో మనల్ని ఎన్నుకున్న ప్రజలు చావుబతుకుల సమస్యలో వున్నారని, కాబట్టి  వార్డు సచివాలయాల సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేద్దామని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.ఎక్స్‌ అఫిషియో సభ్యుడి హోదాలో హాజరైన ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి  మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రద్దీ ఎక్కువగా వుండే ప్రాంతాలను గుర్తించి జనసమ్మర్ధాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో జనం ఎక్కువగా చేరేది దుకాణాల్లోనే కనుక ఇకపై రాత్రి 7 గంటలకే షాపులు మూసివేయాలని ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించారు.అలాగే ఇందిరా ప్రియదర్శినీ కూరగాయల మార్కెట్‌కు రోజుకు పదివేల మందికి పైగా నగరవాసులు వెళుతున్నారని, కాబట్టి మార్కెట్‌ను వికేంద్రీకరించి ఏడెనిమిది చోట్ల ఏర్పాటు చేస్తే జనం రద్దీ తగ్గుతుందని ఈ దిశగా కూడా తీర్మానం చేయాలని సూచన చేశారు. తిరుపతివాసులు గర్వించదగ్గ రీతిలో హనుమంతుడి జన్మస్థానం తిరుమలగిరులేనని ప్రకటించిన టీటీడీని, ప్రత్యేకించి ఈవో జవహర్‌రెడ్డిని అభినందిస్తూ కౌన్సిల్‌ తీర్మానం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.వేసవిలో తాగునీటి సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం రూ. 2.50 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. పవర్‌ బోర్లు, టర్బ్‌లైన్‌ పంపు సెట్లు, వాటి మరమ్మతుల కోసం రూ. 75 లక్షలు, బోరు బావుల లోతు పెంచడానికి, ఫ్లషింగ్‌ చేయడానికి రూ. 50 లక్షలు, వాటర్‌ పైపులైన్ల మరమ్మతులకు రూ. 50 లక్షలు చొప్పున అవసరమని ప్రతిపాదించారు. అలాగే నగరంలో రోజకు వంద ట్రిప్పుల చొప్పున 150 రోజుల పాటు తాగునీటి ట్యాంకర్ల నిర్వహణ కోసం రూ. 75 లక్షలు అవసరమని ప్రతిపాదించారు. ఈ మేరకు మొత్తం రూ.2.50 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను గురువారం జరిగిన తొలి సమావేశంలో కౌన్సిల్‌ ఆమోదించింది.

ఏకపక్ష నిర్ణయం వద్దు :అభినయ్‌


తిరుపతిలో రాత్రి 7 గంటలకే షాపులు మూసివేయాలంటూ కౌన్సిల్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే తనయుడు, కార్పొరేటర్‌ అభినయరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఆ నిర్ణయం సముచితమే అయినప్పటికీ నిర్ణయం తీసుకునే ముందు వ్యాపారులతో కూడా చర్చిస్తే బాగుంటుందని సూచించారు. వారి కష్టనష్టాలు కూడా తెలుసుకుని, ఆ మేరకు షాపుల మూసివేత వేళలను నిర్ణయించడం సబబుగా వుంటుందని కోరారు.కార్పొరేటర్ల సహకారంతో తిరుపతి నగరాన్ని దేశంలోనే మూడు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తామని కమిషనర్‌ గిరీష అన్నారు. ఽఅధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-04-23T07:03:06+05:30 IST