ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌గా షమీం అస్లం

ABN , First Publish Date - 2021-07-17T05:30:00+05:30 IST

మదనపల్లెకు చెందిన వైసీపీ నాయకురాలు గండ్లూరు షమీంఅస్లాంను ఏపీఎండీసీ(ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, ఆది నుంచీ వైసీపీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులను సంతృప్తి పరుస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో నియమించిన నామినేటెడ్‌ పోస్టుల జాబితాలో మదనపల్లె నుంచి షమీంఅస్లాం ఉన్నారు.

ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌గా షమీం అస్లం

మదనపల్లె, జూలై 17: మదనపల్లెకు చెందిన వైసీపీ నాయకురాలు గండ్లూరు షమీంఅస్లాంను ఏపీఎండీసీ(ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ, ఆది నుంచీ వైసీపీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులను సంతృప్తి పరుస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో నియమించిన నామినేటెడ్‌ పోస్టుల జాబితాలో మదనపల్లె నుంచి షమీంఅస్లాం ఉన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవికి ఎంపిక చేసిన సీఎం జగన్‌, అందుకు సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్‌రెడ్డికి,  ఎమ్మెల్యే ఎం.నవాజ్‌బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పదవికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.



షమీంఅస్లాం నేపథ్యం


మదనపల్లె మైనార్టీ వర్గానికి చెందిన జి.షమీంఅస్లాం 1987లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆమె చిన్నాన్న గండ్లూరు ముజీబ్‌హుస్సేన్‌ మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1995-2000లో రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 2014 వరకూ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 2019లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినా... నామినేటెడ్‌ పదవిని దృష్టిలో పెట్టుకుని, తన కోడలు ముబషీర్‌కు అవకాశం కల్పించారు. అంతకుముందు షమీం అస్లాం... 1998లో పీసీసీ సభ్యురాలిగా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.షాజహాన్‌బాషా నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో పార్టీ అధికారిక అభ్యర్థిగా జి.షమీంఅస్లాం గొడ్డలి గుర్తుపై పోటీ చేశారు. అనంతరం 2005లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌గా, 2010లో మూడునెలలు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌ నుంచి వైసీపీలో చేరిన మొదటిసారి 2012లో ఆమెను అధిష్ఠానం నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించగా, 2014లో మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో అవకాశం తృటిలో తప్పిపోయింది. అనంతరం వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2018లో కడప జిల్లా మహిళా కోర్డినేటర్‌గా పనిచేసిన షమీంఅస్లాంకు తాజాగా ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది.


Updated Date - 2021-07-17T05:30:00+05:30 IST