శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు
ABN , First Publish Date - 2021-12-09T07:59:44+05:30 IST
తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ఆవరణలో టీటీడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు.

రెండు వారాల్లో కీహోల్ పరిజ్ఞానంతో గుండె రంధ్రాలు పూడ్చే ఆపరేషన్లు
తిరుపతి సిటీ, డిసెంబరు 8: తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ఆవరణలో టీటీడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. బైరెడ్డిపల్లెకు చెందిన పవిత్ర(6), దామలచెరువుకు చెందిన రిషిత(4), కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెలకు చెందిన జి.వెంకట నాగశేషు కుమారుడు (2 నెలలు), డోన్‌కు చెందిన గౌతం(4 నెలలు).. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని అప్పులకుంటకు చెందిన వేదాంత(4), తాడిపత్రికి చెందిన ఇంషాద్ (4 నెలలు).. తమిళనాడుకు రాష్ట్రం పల్లిపట్టుకు చెందిన యోక్షితశ్రీ (7 నెలలు)కి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ నేతృత్వంలో విజయవంతంగా శస్త్రచికిత్సలు చేశారు. ఐసీయూ, జనరల్ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ చిన్నారులను బుధవారం టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 11న ప్రారంభించిన ఆస్పత్రిలో నెల వ్యవధిలో ఒక బాలికకు, ఆ తర్వాత ఇద్దరు చిన్నారులకు, ఇప్పుడు ఒకేసారి ఏడుగురికి గుండె సర్జరీలు చేయడంపై వైద్య బృందాన్ని ఈవో అభినందించారు. వీరిలో నలుగురిని బుధవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. రూ.లక్షల ఖర్చుచేసే స్థోమతలేని నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో కీహోల్ పరిజ్ఞానంతో గుండె రంధ్రాలు పూడ్చే అపరేషన్లను ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఆయన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. తమ చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయడంపై వారు టీటీడీకి రుణపడి ఉంటామని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, బర్డ్ ఆస్పత్రి ఓఎస్డీ డాక్టర్ రెడ్డప్పరెడ్డి, చిన్నపిల్లల హృదయాలయం ఆర్ఎంవో డాక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.