ఒడిఒడిగా బడికి
ABN , First Publish Date - 2021-02-02T05:12:11+05:30 IST
కొవిడ్‌తో గతేడాది మార్చిలో మూతపడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

తిరుపతి నగరంలో తొలిరోజు 60శాతం హాజరు
తిరుపతి(విద్య), ఫిబ్రవరి 1: కొవిడ్‌తో గతేడాది మార్చిలో మూతపడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 11 నెలల తర్వాత ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు బడిగంట మోగింది. ఇప్పటికే విడతల వారీగా 6 నుంచి 10 తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, చాలారోజులుగా ఇంటిపట్టునే ఉన్న 1-5 తరగతుల విద్యార్థులు తిరిగి సోమవారం వీపున పుస్తకాల బ్యాగులు తగిలించుకుని ఒడిఒడిగా బడిమెట్లు ఎక్కారు. తిరుపతి నగరపాలక పరిధిలోని 30ప్రాథమిక, 5యూపీ స్కూళ్లలో 1-5 తరగతుల్లో 3,748మంది చదువుతుండగా.. తొలిరోజు 2211మంది (60 శాతం) హాజరైనట్లు సమాచారం. ఆ స్కూళ్లలో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ విద్యార్థులను స్వాగతించారు. ప్రతిస్కూల్‌లో శానిటరీ సూపర్‌వైజర్, సెక్రటరీ, మేస్త్రీ, ఏఎన్‌ఎం, యాక్టివ్ రీసోర్స్ పర్సన్లు విద్యార్థులకు థర్మల్‌స్కానింగ్ చేసి, మాస్కులు ధరించేలా చూశారని కార్పొరేషన్ డీవైఈవో జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తమపిల్లలను బడికి పంపాలా..వద్దా అన్న సందిగ్ధంలో ఇంకా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష బోధన దిశగా..
ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటి వరకు 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష్యంగా, 6నుంచి8 తరగతులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారని సమాచారం. తిరుపతిలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో పదో తరగతికి సంబంధించి ఆఫ్‌లైన్‌లో 75శాతానికిపైగా, 8,9తరగతుల్లో 40-50శాతం, 6,7తరగతుల్లో 25శాతంలోపు విద్యార్థులు పాఠాలు వింటున్నారని తెలిసింది. దీంతో ఆన్‌లైన్ విధానానికి క్రమంగా స్వస్తి పలికి మరో వారం రోజుల్లో ఆఫ్‌లైన్ బోధన చేపట్టేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి.