భగవద్గీత అఖండపారాయణంతో పులకించిన సప్తగిరులు
ABN , First Publish Date - 2021-12-15T07:21:47+05:30 IST
తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం నిర్వహించిన భగవద్గీత అఖండ పారాయణంతో సప్తగిరులు పులకించాయి.

తిరుమల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం నిర్వహించిన భగవద్గీత అఖండ పారాయణంతో సప్తగిరులు పులకించాయి. చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆచార్య కుప్పా విశ్వనాధ శర్మ మాట్లాడుతూ భగవద్గీతలో సగం పారాయణం చేసిన వారు ఈ భూమి మొత్తాన్ని దానంగా ఇచ్చిన పుణ్యాన్ని పొందుతారన్నారు. మూడవ వంతు గీతా పారాయణం చేసిన వారు గంగా స్నానం చేసిన ఫలితం, ఆరవ వంతు పారాయణం చేసిన వారు సోమయాగం చేసిన ఫలితం, ఒకే ఆధ్యాయాన్ని నిత్యం పారాయణం చేసేవారు రుద్రలోకాన్ని పొంది రుద్రుడి ప్రమధ గణాల్లో ఒకరవుతారన్నారు. ఎవరైతే ఒక అధ్యాయం, ఒక శ్లోకం, ఒక పాదం చదువుతారో వారికి మానవ జన్మకంటే తక్కువ జన్మ కలగదని తెలిపారు. అలాగే ఒకటి నుంచి పది శ్లోకాలు లేదా కనీసం ఒక అక్షరం చదువుతారో వారు చంద్రలోకం పొంది, 10 వేల సంవత్సరాల పాటు అక్కడ భోగాలను అనుభవిస్తారని భగవద్గీత తెలుపుతోందన్నారు. అఖండ పారాయణంలో ఆచార్య కాశీపతి సోమయాజులు, నరసింహ శర్మ, మారుతీ శ్లోకాలను పారాయణం చేశారు కుప్పా విశ్వనాథ శర్మ ఫలశృతిని వివరించారు.టీటీడీ అదనపు ఈవో ఽధర్మారెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, పలువురు పండితులు, వేదపారాయణదారులు పాల్గొన్నారు.