ఆగమోక్తంగా పవిత్రాల సమర్పణ

ABN , First Publish Date - 2021-08-20T07:13:00+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.

ఆగమోక్తంగా పవిత్రాల సమర్పణ
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సమర్పించిన పవిత్ర మాలలు

నేటి పూర్ణాహుతితో శ్రీవారి పవిత్రోత్సవాల పూర్తి


తిరుమల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. తర్వాత వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామికి, వకుళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభానికి, బలిపీఠం, భూవరాహస్వామికి, బేడి ఆంజనేయస్వామికి పవిత్ర మాలలు సమర్పించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని వివరించారు. జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, డిప్యూటీఈవో రమే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T07:13:00+05:30 IST