రూ.5లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-26T06:46:52+05:30 IST

కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు.

రూ.5లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం
నిందితుల వివరాలు తెలియజేస్తున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

ఏడుగురి అరెస్టు

కారు, రెండు ద్విచక్ర వాహనాల సీజ్‌


చిత్తూరు, నవంబరు 25: కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని అరెస్టు చేశారు. వివరాలను ఒకటో పట్టణ సీఐ నరసింహరాజుతో కలిసి గురువారం డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు తెలియజేశారు. చిత్తూరు పీవీకేన్‌ డిగ్రీ కళాశాల వెనుకవైపున కర్ణాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో సీఐలు నరసింహరాజు, యుగంధర్‌, ఎస్‌ఐలు అనిల్‌కుమార్‌, పద్మావతి తమ సిబ్బందితో నాకాబందీ నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలను ఆపారు. రెండు వాహనాల్లోని పలమనేరు రంగాపురానికి చెందిన లోకనాథం, చిత్తూరు సంతపేటకు చెందిన క్రాంతి, వీరభద్రకాలనీకి చెందిన మురాజ్‌, మార్కెట్‌ వీధికి చెందిన ఉస్మాన్‌, తేనబండకు చెందిన జయశంకర్‌, సంతపేట ఎల్లమ్మవీధికి చెందిన దివాకర్‌, రాజలను అదుపులోకి తీసుకుని, విచారించారు. కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్లు తేలడంతో వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే టెట్రాప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారు (రూ.7లక్షలు), రెండు ద్విచక్రవాహనాల (రూ.లక్ష)ను సీజ్‌ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపారు. కాగా.. కారులో నుంచి మరికొందరు పరారయ్యారని, వారిని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-26T06:46:52+05:30 IST