గదుల మరమ్మతులు సకాలంలో పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-10-20T07:53:52+05:30 IST
తిరుమలలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న గదుల మరమ్మతులను సకాలంలో పూర్తిచేసి భక్తులకు కేటాయించేందుకు సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

సెల్‌ఫోన్ సిగ్నళ్లు సక్రమంగా ఉండేలా చూడండి
అధికారులతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి
తిరుమల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న గదుల మరమ్మతులను సకాలంలో పూర్తిచేసి భక్తులకు కేటాయించేందుకు సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. విశ్రాంతి గృహాల వద్ద పచ్చదనం పెంచి పరిసరాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. ఏటీసీ ప్రాంతంలోని ఆళ్వార్ ట్యాంక్, ఎంబీసీ వద్దనున్న మంగళబావి కుంటలో కలుపు తొలగించి సుందరీకరించాలని ఆదేశించారు. తిరుమలలో సెల్‌ఫోన్ సిగ్నళ్లు సరిగా లేని ప్రాంతాలను గుర్తించాలని, సంబంధిత టెలికాం ప్రోవైడర్లతో చర్చించి సిగ్నళ్లు బాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, విజిలెన్స్ తదితర విభాగాలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ భక్తుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. శిలాతోరణం, ఇతర ప్రాంతాల్లోని దుకాణాల్లో ప్లాస్టిక్ పదార్థాలు వాడుతున్నారని, నిషేధంపై వారికి అవగాహన కల్పించాలన్నారు. దుకాణాల్లో గాజు నీటి సీసాలు మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎస్వీ ఉన్నత పాఠశాలలో విద్యాప్రమాణాలను పెంచేందుకు ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, అధికారులు క్రమంగా తప్పకుండా సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని డీఈవో సూచించారు. ఆయా విభాగాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని డీపీడబ్ల్యూ స్టోర్స్‌కు తరలించాలన్నారు. తర్వాత విభాగాల వారీగా ఆడిట్ అభ్యంతరాలపై సమీక్షించారు.