రైస్ పుల్లింగ్ ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2021-11-28T07:20:36+05:30 IST
ఓ నల్లటి చెంబును చూపి.. మహత్తర శక్తి కలదంటూ నమ్మించి.. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.54 లక్షలు కాజేసిన రైస్‌పుల్లింగ్ ముఠాను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు.

రూ.1.54 లక్షలు, రాగిచెంబు స్వాధీనం
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 27: ఓ నల్లటి చెంబును చూపి.. మహత్తర శక్తి కలదంటూ నమ్మించి.. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.54 లక్షలు కాజేసిన రైస్‌పుల్లింగ్ ముఠాను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్లో శనివారం ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలను తెలియజేశారు. మదనపల్లె దేవళం వీధికి చెందిన బి.సుధాకర్ కుమారుడు బండారి హేమంత్ (28), తిరుపతిలోని సుభా్‌షనగర్‌కు చెందిన శేషరాజయ్య కుమారుడు జి.మనోజ్‌కుమార్ (34), ఎర్రమిట్టకు చెందిన షణ్ముగం కుమారుడు ఆర్కాట్ విజయ్‌కుమార్ (44), సత్యన్నారాయణపురానికి చెందిన బి.నాగులు కుమారుడు బిర్ల నాగరాజు(34) ఒక ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరిట మోసంచేసి, డబ్బు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో హేమంత్‌కుమార్ నెట్లో చూసి.. ఓ చెంబును తయారు చేశాడు. మహత్తుకల్గిన చెంబు తమవద్ద ఉందంటూ గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన షేక్ యాసిన్ (48)కు చెప్పారు. ఈ చెంబు ఇంట్లో ఉంటే కలిసి వస్తుందంటూ ఆయన్ను నమ్మించారు. రూ.కోట్ల విలువజేసే చెంబును అతితక్కువ ధరకు విక్రయిస్తామన్నారు. దాంతో ఆయన గుంటూరు నుంచి తిరుపతికి వచ్చి ముఠాను కలిశాడు. లోహపదార్థం కాని బియ్యాన్ని కూడా చెంబు ఆకర్షించేలా ముఠా సభ్యులు చేసి, చూపించారు. అప్పటికే వీరి ఉచ్చులో పడిన ఆయన రూ.1.54లక్షలు వారికి చెల్లించి ఆ చెంబును తీసుకెళ్లాడు. తనింటికి వెళ్లాక చెంబుకు ఎటువంటి మహత్తు లేదని గుర్తించిన ఇటీవల తిరుపతికివచ్చి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన అలిపిరి సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ జయచంద్ర నిఘాపెట్టి.. నలుగురు మోసగాళ్లను శనివారం తిరుపతిలో అరెస్టు చేశారు. వారినుంచి మరో రాగి చెంబును, రూ.1.54 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.