రాయ్‌పూర్‌ టమోటా ‘పంట’ పండింది

ABN , First Publish Date - 2021-12-08T07:06:38+05:30 IST

దేశంలో టమోటా అంటేనే గుర్తుకొచ్చేది ఆంధ్రలోని మదనపల్లె, కర్ణాటకలోని కోలారు మార్కెట్లు. గత ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా మదనపల్లె ప్రాంతం నుంచి టమోటా ఎగుమతులు అయ్యాయి.

రాయ్‌పూర్‌ టమోటా ‘పంట’ పండింది
మధ్యప్రదేశ్‌లోని రాయపూర్‌ ప్రాంతం దందా వద్ద ఎస్టేట్‌ను తలపించేలా టమోటా పంట సాగు

ఏపీ, తమిళనాడు, కర్ణాటకలకు దిగుమతి

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 7: దేశంలో టమోటా అంటేనే గుర్తుకొచ్చేది ఆంధ్రలోని మదనపల్లె, కర్ణాటకలోని కోలారు మార్కెట్లు. గత ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా మదనపల్లె ప్రాంతం నుంచి టమోటా ఎగుమతులు అయ్యాయి. కానీ వరుస తుఫాన్లతో అధిక వర్షాలు కురవడంతో చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురంలోని ముదిగుబ్బ, కర్ణాటకలోని కోలారు ప్రాంతాల్లో టమోటా పంట పూర్తిగా దెబ్బతినింది. దీంతో కోస్తాంధ్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో టమోటా వినియోగానికి అవసరమైన ఎగుమతులు లేకపోవడంతో  ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో టమోటా రూ.50 నుంచి రూ.100కు చేరుకుంది.


రాయ్‌పూర్‌ టమోటా...

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ ప్రాంతంలోని భిలాయ్‌, దందా, భాటాపారా, అవైవరా ప్రాంతాల్లో టమోటా ఎక్కువగా పండిస్తున్నారు. ఒక్కో టమోటా ఎస్టేట్‌ వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వేలాది ఎకరాల్లో అక్కడి రైతులు టమోటా సాగు చేస్తున్నారు. శీతాకాలంలో అక్కడి వాతావరణం అనుకూలించడంతో పాటు మొక్కలు ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరిగాయి. దీంతో మొక్కలకు ఓ వైపు పూత పిందె వస్తుండగానే మరో వైపు టమోటా కోతలు పడుతున్నాయి. అంతేకాక మదనపల్లె ప్రాంతంలో ఎకరాకు వెయ్యి బాక్సులు(బాక్సు-30కిలోలు) మాత్రమే దిగుబడి వస్తుండగా, రాయ్‌పూర్‌ ప్రాంతంలో ఎకరాకు 4వేల బాక్సులు పండుతోంది. దీంతో మదనపల్లె, తమిళనాడు, కర్ణాటక నుంచి వ్యాపారులు పెద్దఎత్తున రాయ్‌పూర్‌ వెళ్లి అక్కడి టమోటా ఎస్టేట్ల నుంచే టమోటా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లకు వెళ్లకుండా అక్కడి తోటల నుంచే టమోటాలను లారీల్లో లోడ్‌ చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.  మదనపల్లె, ములకలచెరువు, పలమనేరు, కర్ణాటక రాష్ట్రం కోలారు మార్కెట్లకు రాయ్‌పూర్‌ టమోటా దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి కోస్తాంధ్ర, తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారు. నెల రోజులుగా రాష్ట్ర ప్రజలు టమోటా కొనుగోలుకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.Updated Date - 2021-12-08T07:06:38+05:30 IST