తిరుమలలో వర్షం

ABN , First Publish Date - 2021-05-21T06:22:42+05:30 IST

తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది.బుధవారం రాత్రి 12.30 గంటలకు ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం గురువారం తెల్లవారుజాము 3 గంటల వరకు కురిసింది.

తిరుమలలో వర్షం
శ్రీవారి ఆలయం ముందు కురుస్తున్న వర్షం

తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం భారీ వర్షం కురిసింది.బుధవారం రాత్రి 12.30 గంటలకు ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం గురువారం తెల్లవారుజాము 3 గంటల వరకు కురిసింది. ఈ క్రమంలో పలు ప్రదేశాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.వర్షం నిలిచిపోయినప్పటికీ నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. తిరిగి గురువారం సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు మోస్తరు వర్షం కురిసింది.శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు వర్షంలో తడవకుండా జర్మన్‌ షెల్టర్ల కింద సేదదీరారు. మరోవైపు తిరుమలలో చలితీవ్రత పెరిగింది.ఘాట్‌రోడ్లలో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలంటూ జీఎస్సీ, అలిపిరి వద్ద సెక్యూరిటీ సిబ్బంది సూచనలు చేశారు. అలాగే ఘాట్‌రోడ్లలో ఎక్కడైనా కొండ చరియలు విరిగి పడే అవకాశముందా అనే అంశంపై టీటీడీ ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ అధికారులు గురువారం పరిశీలన చేయడంతో పాటు కొన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచారు. వేకువజామున ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగాలుల కారణంగా భారీ వృక్షమొకటి పార్కింగ్‌లో ఉన్న కారుపై పడింది. దీంతో కారు కొంతమేర ధ్వంసమైంది. శంఖుమిట్ట కాటేజీ, శ్రీవారిపాదాల మార్గంలో కూడా వృక్షాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ వైర్లు కూడా తెగిపడ్డాయి.  సిబ్బంది చెట్లను తొలగించడంతో పాటు తెగిన విద్యుత్‌వైర్లను కూడా సరిచేశారు. 

Updated Date - 2021-05-21T06:22:42+05:30 IST