కూలుతున్న పుంగనూరు జమీందారీ ప్యాలెస్
ABN , First Publish Date - 2021-11-21T06:07:52+05:30 IST
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పుంగనూరులో చారిత్రక చిహ్నమైన జమీందారీ ప్యాలెస్‌లోని ఓ వైపు గోడలు శనివారం కూలిపోయాయి.

పుంగనూరు, నవంబరు 20: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పుంగనూరులో చారిత్రక చిహ్నమైన జమీందారీ ప్యాలెస్‌లోని ఓ వైపు గోడలు శనివారం కూలిపోయాయి. శుక్రవారం వర్షాలకు దర్బార్‌హాల్ వద్ద ప్రహరీ పడిపోగా తర్వాత ప్యాలెస్‌లోని కుడిపైపు గోడలు నేలమట్టమయ్యాయి. గౌని వంశానికి చెందిన జమీందారు ఇమ్మడి రాజావీరబసవ చిక్కరాయులు ఈ ప్యాలెస్ నిర్మించారు. ప్యాలెస్ మధ్యలో దర్బారుహాల్ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర అనంతరం జమీందారీ వ్యవస్థ రద్దుకాగా జమీందారులు పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లారు. కానీ ప్రతి ఏటా ఘనంగా జరిగే పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర చాటింపు నుంచి జాతర ముగిసేవరకు జమీందారులు ఇక్కడే ఉంటూ వారే జాతర నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ప్యాలెస్ శిథిలావస్దకు చేరడంతో జాతర రోజు అమ్మవారి దర్శనానికి పరిమితంగానే భక్తులను అనుమతించేవారు. ప్యాలెస్ కళానైపుణ్యం, ప్రశస్తి, వైభవం కారణంగా అనేక సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. ప్రస్తుత వర్షాలతో గోడలు కూలడంతో ఈ ప్యాలెల్ ఓ చరిత్రగా మిగిలిపోతుందా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.