దొంగతనాలను అరికట్టండి : డీఐజీ

ABN , First Publish Date - 2021-10-14T05:49:02+05:30 IST

దొంగతనాలను అరికట్టి, శాంతి భద్రతలను పరిరక్షించాలని డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశించారు.

దొంగతనాలను అరికట్టండి : డీఐజీ
సమావేశంలో ప్రసంగిస్తున్న డీఐజీ క్రాంతి రాణా టాటా

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 13: దొంగతనాలను అరికట్టి, శాంతి భద్రతలను పరిరక్షించాలని డీఐజీ క్రాంతి రాణా టాటా ఆదేశించారు. అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడితో కలిసి బుధవారం పోలీసు సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న నేరాల తీరు, పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న క్రైమ్‌, ఆస్తి తగాదాలకు సంబంధించిన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరచూ జరుగుతున్న దొంగతనాలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైన చోట పికెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధికారులు తరచూ బీట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సాంకేతికమైన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. ప్రధానంగా పోక్సో కేసుల్లో ఆలస్యం లేకుండా దర్యాప్తు పూర్తిచేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా పోలీసు బృందాలను రంగంలోకి దించామని వివరించారు. ఇప్పటికే కొన్ని బృందాలను పొరుగు రాష్ట్రాలకు పంపించి పాత, కొత్త నేరస్తులను గుర్తించామన్నారు. ఫిన్స్‌, మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైస్‌ పాపిలాన్‌ ద్వారా వేలిముద్రలు సేకరిస్తూ నేరస్తులను గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌)పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఏఎస్పీలు సుప్రజ, ఆరీఫుల్లా, మునిరామయ్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-14T05:49:02+05:30 IST