ఎస్వీయూలో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-05-30T06:50:13+05:30 IST

ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఎస్వీయూలో పదోన్నతులు, బదిలీలకు రంగం సిద్ధం

రెండ్రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 29: ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమ, మంగళ వారాల్లో కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెలలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. అలాగే, ఇటీవల నియమితులైన రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ కార్యాలయ సిబ్బందిని కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దూరవిద్యా విభాగంలోని ఓ అధికారిని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బదిలీపై తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పనిలో పనిగా పరీక్షల విభాగంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా పరీక్షల విభాగంలోనే తిష్ఠ వేసిన వారికి స్థాన చలనం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఒకేసారి పరీక్షల విభాగంలోని సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో బదిలీ చేస్తే రాజకీయ ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో దశల వారీగా బదిలీలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. కాగా, బదిలీల జాబితా బయటికి పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాబితా బయటికి పొక్కితే అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రముఖుల నుంచి తమపై ఉద్యోగులు ఒత్తిడి తెప్పిస్తారని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2021-05-30T06:50:13+05:30 IST