ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి పోలీస్‌ యంత్రాంగం

ABN , First Publish Date - 2021-03-24T06:09:37+05:30 IST

తిరుపతి లోక్‌ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో మంగళవారం నుంచి తిరుపతి అర్బన్‌, నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అజమాయిషీ కిందకు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి పోలీస్‌ యంత్రాంగం

కలికిరి, మార్చి 23: తిరుపతి లోక్‌ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో మంగళవారం నుంచి తిరుపతి అర్బన్‌, నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అజమాయిషీ కిందకు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోకి వచ్చే తిరుపతి లోక్‌ సభ ఉప ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయమున్న పోలీసు యంత్రాంగం మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అజమాయిషీలో పనిచేయాలని ఆదేశించింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఎస్పీలతోపాటు తిరుపతి లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లందరినీ కేంద్ర ఎన్నికల సంఘానికి డిప్యుటేషన్‌పై పంపుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరితోపాటు డీజీపీ, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు), అనంతపురం, గుంటూరు ఐజీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో డిప్యుటేషన్‌ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశిస్తూ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి, ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-03-24T06:09:37+05:30 IST