తిరుమలలో ఫొటోగ్రాఫర్‌ సజీవదహనం

ABN , First Publish Date - 2021-05-05T07:04:22+05:30 IST

తిరుమలలోని ఓ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఫొటోగ్రాఫర్‌ మలిరెడ్డి సజీవదహనమయ్యాడు.

తిరుమలలో ఫొటోగ్రాఫర్‌ సజీవదహనం
మలిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

తిరుమల, మే 4 (ఆంధ్రజ్యోతి): కొడుకు కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా బుధవారం బిడ్డ పుట్టిన రోజు జరపాలనుకున్నాడు. దీనికోసం భక్తుల ఫొటోలు తీసి నాలుగు రూపాయలతో వద్దామని తిరుమల వచ్చాడు. మంగళవారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఆయనతోపాటు, ఆ ఆశ కూడా మంటల్లో కాలిపోయింది. ఆ కొడుకు కంట్లో కన్నీటిని మిగిల్చింది. ఈ విషాద ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. తిరుచానూరుకు ఫొటోగ్రాఫర్‌ మలిరెడ్డి(40)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తిరుమలలో అఖిలాండం వద్ద ఎవరైనా భక్తులు అడిగితే ఫొటోలు తీయడం, ఆస్థానమండపంలోని స్టూడియోలో ప్రింట్‌ తీసిస్తాడు. భక్తుల నుంచి ఓ ఫొటోకు రూ.100 తీసుకుంటే అందులో సగం ఇతడికి వస్తుంది. ఈ సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా వ్యాప్తితో ఇటీవల తిరుమలకు భక్తుల సంఖ్య తగ్గడంతో అన్ని వ్యాపారాలు పడిపోయాయి. దీని ప్రభావం మలిరెడ్డిపైనా పడింది. పని లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో కుమారుడు చైతన్యకు బుధవారం పుట్టినరోజు. దీంతో ‘తిరుమలకు వెళ్లి కొన్ని ఫొటోలు తీస్తే ఎంతో కొంత వస్తుంది. మనోడికి పుట్టినరోజు చేయడంతో పాటు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనచ్చు’ అంటూ భార్య శోభకు చెప్పి సోమవారం రాత్రి తిరుమలకు వచ్చాడు. ఆస్థానమండపంలోని ఫొటోలు ప్రింట్‌ తీసే దుకాణంలో పడుకున్నాడు. అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యాడు. కరోనా ఉందని జాగ్రత్తలు చెప్పిపంపిన భార్యకు, త్వరగా రా నాన్న అంటూ పంపిన పిల్లలకు తీవ్ర శోకమే మిగిలింది. మంగళవారం ఉదయం 11 గంటలకు భర్త చనిపోయాడని తెలుసుకుని కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చిన శోభ తీవ్రంగా రోదించారు. Updated Date - 2021-05-05T07:04:22+05:30 IST