వైసీపీ దౌర్జన్యకాండ
ABN , First Publish Date - 2021-02-01T07:30:40+05:30 IST
టీడీపీ క్యాంపులో ఉన్న కార్యకర్తలపై దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు దాక్కున్నా వదల్లేదు. ఇంటి మీద దాడి చేసి కిటికీలు, తలుపులు కూడా పగులగొట్టారు.

దళిత మహిళను నామినేషన్ వేయనీకుండా అడ్డుకున్న వైసీపీ నాయకులు
టీడీపీ కార్యకర్తలపై రాడ్లు, కర్రలతో దాడి
ఎమ్మెల్సీ దొరబాబు కారు ధ్వంసం
అదొక వెయ్యి ఓట్లున్న చిన్న పంచాయతీ. సర్పంచి స్థానం జనరల్ మహిళకు రిజర్వయింది. ఇక్కడ టీడీపీ మద్దతుదారు అయిన ఎస్సీ వర్గానికి చెందిన మహిళ నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది.ఈ విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఆమె భర్తను బెదిరించారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ఆమెకు మద్దతుగా నామినేషన్ వేయించేందుకు తోడు వెళ్లారు. వైసీపీ వర్గీయులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కారు ఆపకపోవడంతో ధ్వంసం చేశారు. టీడీపీ క్యాంపులో ఉన్న కార్యకర్తలపై దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు దాక్కున్నా వదల్లేదు. ఇంటి మీద దాడి చేసి కిటికీలు, తలుపులు కూడా పగులగొట్టారు. దాడి చేసింది చాలదన్నట్లు మళ్లీ టీడీపీ వర్గీయుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యాదమరి/చిత్తూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదమరి మండలంలో శుక్రవారం నుంచి నామినేషన్లు వేస్తున్నారు. పెరియంబాడి పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఎవర్నీ నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. ఆదివారం చివరి రోజు కావడంతో టీడీపీ మద్దతుదారు కుమారి అనే ఎస్సీ వర్గానికి చెందిన మహిళ నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది.దీంతో వైసీపీ నాయకులు ఆమెతో పాటు భర్త దిలీ్‌పను కూడా బెదిరించారు. ఈ విషయం తెలియడంతో చిత్తూరు నుంచి ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ దొరబాబు యాదమరికి వెళ్లారు. ఎంపీడీవో కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలో టీడీపీ నాయకులు అభ్యర్థులతో కలిసి క్యాంపును నిర్వహించారు.అక్కడినుంచి కుమారిని కారులో ఎక్కించుకుని నామినేషన్ వేయించేందుకు బయల్దేరారు.ఈలోపే పరిస్థితిని పోలీసులకు వివరించి, ఎస్కార్ట్ కావాలని ఎమ్మెల్సీ కోరారు. క్యాంపు నుంచి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుని కుమారితో కలిసి దొరబాబు తన కారులోనే ఎంపీడీవో కార్యాలయానికి బయల్దేరారు. ఎమ్మెల్సీ కారు ముందు ఎస్కార్ట్ ఉన్నప్పటికీ, ఎంపీడీవో కార్యాలయానికి కూతవేటు దూరంలో వైసీపీ వర్గీయులు రాడ్లు, కర్రలతో ఎమ్మెల్సీ వాహనాన్ని ముట్టడించారు.ఎదురుగా ఓ కారును,మోటర్‌సైకిలును అడ్డుపెట్టారు.కారు నిలిపితే దాడి చేస్తారనే ఉద్దేశంతో కారు డ్రైవరు వాహనాన్ని ఆపకుండా ముందుకువెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో వైసీపీ వర్గీయులు కారు అద్దాలను ధ్వంసం చేశారు.టీడీపీ క్యాంపు కార్యాలయమున్న భాస్కరనాయుడి షెడ్‌పై దాడికి దిగారు.టీడీపీ కార్యకర్తలను తరిమి కొట్టారు. కొందరు పక్కనే ఓ గదిలో దాక్కోగా.. వైసీపీ వర్గీయులు ఆ ఇంటి కిటికీలను సైతం ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ వినాయక్ గౌండర్‌కు ముఖంపై గాయమైంది. అక్కడున్న 20 ద్విచక్ర వాహనాలను, 2 కార్లను, 2 టాటా ఏస్ వాహనాలను కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఇంతటి ఘర్షణ వాతావరణంలోనూ కుమారితో ఎమ్మెల్సీ నామినేషన్ వేయించగలిగారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఉండగానే టీడీపీ కార్యకర్తల మీదకు వైసీపీ వర్గీయులు విరుచుకుపడడంతో డీఎస్పీ సుధాకరరెడ్డి అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీని భద్రత నడుమ చిత్తూరుకు పంపించారు.ఈలోపు ఎమ్మెల్సీ దొరబాబు తమను కారుతో గుద్దించారని, తమ పార్టీ నాయకుడొకరి కాలికి గాయమైందని వైసీపీ వర్గీయులు పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.ఇంతలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబు పార్టీ కార్యకర్తలతో కలసి పోలీసులతో మాట్లాడారు.అనంతరం వైసీపీ శ్రేణుల పిర్యాదు మేరకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు చేరుకున్న ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ నాయకులతో కలసి చిత్తూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపై వైసీపీ దాడికి సంబంధించిన సీసీ టీవీ పుటేజి వుందన్నారు. వైసీపీ కార్యకర్తలు తమ వాహనంపై విచక్షణా రహితంగా దాడిచేశారన్నారు. ఒకవేళ తాము వాహనాన్ని ఆపివుంటే తమపైనే దాడిచేసేవారని అన్నారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నానీ మాట్లాడుతూ బెదిరింపులు, దౌర్జన్యాలు, బ్లాక్‌మెయిల్, ప్రలోభాలతో పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆదివారం పెరియంబాడి పంచాయితీకి నామినేషన్ వేయడానికి వెళుతున్న దళిత మహిళ కుమారిని బెదిరించారని చెప్పారు. ఆమె భర్త దిలీ్‌పను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వైసీపీకి గెలుస్తామనే ధీమా ఉంటే ఏకగ్రీవాలెందుకని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ దొరబాబుపై దాడి అమానుషమన్నారు.అనంతరం యాదమరి వెళ్లేందుకు టీడీపీ నాయకులు సిద్ధమవ్వగా.. అక్కడికి చేరుకున్న ఏఎస్పీ మహేష్, డీఎస్పీ సుధాకరరెడ్డి నిలువరించారు.యాదమరికి వెళితే మళ్ళీ ఘర్షణలు జరుగుతాయని కంప్లయింట్ ఇక్కడే తీసుకుంటామని కోరారు. దీంతో వైసీపీ వర్గీయులు చేసిన దాడి గురించి టీడీపీ నాయకులు ఏఎస్పీ మహే్‌షకు ఫిర్యాదు చేశారు.ఆయన రెఫర్ చేయడంతో యాదమరి పోలీసులు సాయంత్రం వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు.ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, యాదమరి మండల వైసీపీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి తదితరులు కూడా చిత్తూరుకు చేరుకుని మీడియాతో మాట్లాడారు.ప్రశాంతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల క్రతువులో ఎమ్మెల్సీ దొరబాబు వచ్చి చిచ్చు పెట్టారని ఆరోపించారు.అసలు ఆయనకు యాదమరిలో ఏంపని అంటూ ప్రశ్నించారు.టీడీపీ నేతల అత్యుత్సాహం వల్ల గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు.

