స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , First Publish Date - 2021-05-20T06:31:08+05:30 IST

వీధి బాలలు, అనాఽథ, నిరాదరణకు గురైన బాలలు కరోనా బారిన పడకుండా పోలీస్‌, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆపరేషన్‌ ముస్కాన్‌
బాల కార్మికురాలితో మాట్లాడుతున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

 జిల్లావ్యాప్తంగా 338 మంది బాలబాలికలకు విముక్తి


చిత్తూరు, మే 19: వీధి బాలలు, అనాఽథ, నిరాదరణకు గురైన బాలలు కరోనా బారిన పడకుండా పోలీస్‌, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద   పట్టణం, సమీప ప్రాంతాల నుంచి రెస్క్యూ చేసిన 42 మంది బాల కార్మికులతో ఎస్పీ ముచ్చటించారు. వారికి పండ్లు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీసు అధికారులు, చైల్డ్‌ వెల్ఫేర్‌కమిటీ, కార్మికశాఖ, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌   కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వీధి బాలలు, అనాథ పిల్లలు, నిరాదరణకు గురైన పిల్లల విముక్తి కోసం దుకాణాలు, పరిశ్రమలు, బస్టాండ్లు, తదితర ప్రాంతాల్లో గాలించామన్నారు. ప్రతి సబ్‌ డివిజనల్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన షెల్టర్‌ హోమ్‌కు  రెస్క్యూ చేసిన పిల్లలను తరలించి అక్కడ వారికి కొవిడ్‌ టెస్టులు చేయించి నమూనాలను ల్యాబ్‌కు పంపామన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత పాజిటివ్‌ లక్షణాలుండే వారిని కొవిడ్‌ ఆస్పత్రులకు, నెగటివ్‌ వచ్చిన వారిని సీడబ్ల్యూసీ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. జిల్లాలో మొత్తం 338 మంది బాల కార్మికులను గుర్తించగా అందులో 315 మంది బాలురు, 23 మంది బాలికలు ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఎం. భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-20T06:31:08+05:30 IST