ఆన్‌లైన్‌ మోసం

ABN , First Publish Date - 2021-06-21T06:30:23+05:30 IST

ఆన్‌లైన్‌ మోసంలో ఓ వైద్య విద్యార్థిని రూ.27,500 పోగొట్టుకున్నారు.

ఆన్‌లైన్‌ మోసం

రూ.27,500 పోగొట్టుకున్న వైద్యావిద్యార్థిని


చంద్రగిరి, జూన్‌ 20: ఆన్‌లైన్‌ మోసంలో ఓ వైద్య విద్యార్థిని రూ.27,500 పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి కొత్తపేటకు చెందిన ఓ వైద్య విద్యార్థినికి పోస్టు ద్వారా ఒక కార్డు వచ్చింది. తన మొబైల్‌ నెంబరుకు లక్కీడిప్‌ ద్వారా రూ.లక్ష వచ్చిందని అందులో ఉంది. దాంతోపాటు ఓ స్ర్కాచ్‌ కార్డు కూడా ఉంది. దాన్ని స్ర్కాచ్‌ చేయగా రూ.10 లక్షలు గెలుచుకున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ కార్డులో ఉన్న హెల్ప్‌లైన్‌ నెంబరుకు వైద్య విద్యార్థిని ఫోన్‌ చేశారు. మొత్తం రూ.11లక్షలు గెలుచుకున్నారని, నగదును మీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటే ముందుగా జీఎస్టీ కట్టాలని నమ్మించారు. ఆమె కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా.. తొలుత రూ.10వేలు, తర్వాత మరో రూ.17,500 వేలను వారు సూచించిన నెంబరుకు ఫోన్‌ పే ద్వారా చెల్లించారు. మొత్తం రూ.27500 వేలను చెల్లించినా తన బ్యాంకు ఖాతాకు రూ.11 లక్షలు జమకాక పోవడంతో తన వద్ద ఉన్న హెల్ప్‌లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేశారు. ఆ నెంబరు పనిచేయక పోవడంతో మోసపోయినట్లు అర్థమై, ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-21T06:30:23+05:30 IST