కాసరంలో వంద ఎకరాల చెరువు భూమి కబ్జా

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

తొట్టంబేడు మండలం కాసరంలో వంద ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురైంది.

కాసరంలో వంద ఎకరాల చెరువు భూమి కబ్జా
కాసరంలో చదును చేసిన చెరువు భూములు

తొట్టంబేడు, అక్టోబరు 25: అధికారుల సహకారమో.. ఉదాసీనతో మరి.. కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కాసింత ప్రభుత్వ భూమి కన్పిస్తే చాలు ఆక్రమణలకు తెగబడుతున్నారు. చెరువు, కాలువ, పశువుల మేత తదితర భూముల్లో పాగా వేస్తున్నారు. ఇందుకు తొట్టంబేడు మండలం కాసరం పంచాయతీలో కొద్దిరోజులుగా జరుగుతున్న కబ్జాలే నిదర్శనం. కొందరు స్థానిక నాయకులు కాసరం గ్రామ సమీపంలోని చెరువు భూములపై కన్నేశారు. మూడురోజులుగా రాత్రిళ్లు ఎక్స్‌కవేటర్లతో వీటిని చదును చేస్తూ ఇప్పటి వరకు రూ.6కోట్ల విలువైన వందెకరాలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. మండలంలోని మారుమూల ప్రాంతంలో ఈ గ్రామం ఉండడం, నెల్లూరు జిల్లా సరిహద్దుగానూ ఉండడంతో ప్రభుత్వ భూములను కబ్జాదారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై తహసీల్దారు పరమేశ్వరస్వామి స్పందిస్తూ.. కాసరంలో భూ ఆక్రమణల విషయమై ఇటీవల ఫిర్యాదులందినట్లు చెప్పారు. దీనిపై విచారణ చేపట్టామనీ, నివేదిక అందగానే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, తహసీల్దార్‌ ఆదేశాల మేరకు.. సోమవారం ఆర్‌ఐ ధనుంజయులు, వీఆర్వో మాధవి కాసరంలో భూ ఆక్రమణలపై విచారణ జరిపారు. చెరువు పొరంబోకు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని స్థానికులను హెచ్చరించారు. ఇకపై కబ్జాలు జరగకుండా పర్యవేక్షణ జరపాలని గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మునెమ్మకు సూచించారు. 

Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST