అయ్యో... దేవుడా.. ఇలా జరిగిందేమయ్యా...!

ABN , First Publish Date - 2021-12-07T07:14:25+05:30 IST

‘దైవ దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగొస్తారని ఎదురు చూస్తుంటే..

అయ్యో... దేవుడా.. ఇలా జరిగిందేమయ్యా...!
మృతదేహాలను చూసి బంధువుల రోదన

  • రుయాలో మృతదేహాలను చూసిన బంధువుల రోదనలు 


తిరుపతి సిటీ, డిసెంబరు 6: ‘దైవ దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగొస్తారని ఎదురు చూస్తుంటే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారే. అయ్యో దేవుడా.. ఇలా జరిగిందేమయ్యా’ అంటూ రుయా మార్చురీ వద్ద మృతదేహాలను చూసి బంధువులు రోదించారు. చంద్రగిరి మండలం అగరాల వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సోమవారం ఎస్వీ వైద్య కళాశాల మార్చురీకి తీసుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి మృతుడు సురేష్‌ మేనమామ, అక్క భర్త వెంకటరమణ, మృతురాలు హైమావతి తమ్ముడు సూరన్‌ నాయుడు, పెద్దల్లుడు మధుతోపాటు సురేష్‌, కొండయ్య, వాసు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి విలపించారు. ఇలా శవాలుగా వస్తారని అనుకోలేదంటూ వెంకటరమణ ఆవేదన వ్యక్తంచేశారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, వారి పిల్లల మృతదేహాలను పక్కపక్కన పెట్టారు. మొదటగా హైమావతి, పైడి గోవిందరావు మృతదేహాల పక్కన వీరి కుమార్తె మీనాకుమారి మృతదేహాన్ని.. ఈమె పక్కన తొమ్మిది ననెలల కుమార్తె జోశ్విక సహస్ర మృతదేహాన్ని ఉంచారు. మరోవైపు సురేష్‌  మృతదేహం పక్కన ఆయన తల్లిదండ్రులు సత్యవతి, శ్రీరామమూర్తి మృతదేహాలు ఉంచారు. ఇలా వరుసగా తల్లిదండ్రుల మృతదేహాలు, వారి పక్కన బిడ్డల మృతదేహాలను పెట్టి మధ్యలో చిన్నారి మృతదేహాన్ని వరుసగా పడుకోబెట్టిన దృశ్యం అక్కడి వారిని చలింప చేసింది. డీఎస్పీ నరసప్ప చొరవతో మధ్యాహ్నం ఒంటిగంట కంతా పోస్టుమార్టం, ఇతరత్రా ఏర్పాట్లు పూర్తి చేసి రెండు అంబులెన్సుల్లో మృతదేహాలను స్వగ్రామానికి పంపారు.


అమ్మ దగ్గరకు తీసుకెళ్లు పెదనాన్నా 

ఈ ఘోర ప్రమాదంలో మృత్యుంజయురాలిగా బయటపడిన మూడేళ్ల జషిత నందన్‌ రుయాస్పత్రిలోని చిన్నపిల్లల అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతోంది. నిద్రపోతున్న ఈమెను పెదనాన్న మధు సోమవారం పలకరించగా.. ‘అమ్మ దగ్గరకు తీసుకువెళ్లు పెద్ద నాన్న’ అంటూ బిగ్గరగా ఏడిచింది.


అమ్మ కావాలంటూ అమాయకంగా అడిగిన ఆ పాపను చూసి తట్టుకోలేక ఒక పక్క దుఃఖిస్తూనే, ఆమెను ఓదార్చారు. అమ్మనాన్నలు, చెల్లెలు, అవ్వతాతలు ఇక లేరని ఆ పాపకు చెప్పలేని పరిస్థితి. చివరి చూపూ చూడలేక.. ఇంత చిన్న వయసులో ఎంత కష్టమొచ్చిందంటూ అక్కడి వారు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, చిన్నారి రెండు తొడ భాగాల్లోని ఎముకలు విరిగాయి. వాటికి పిండి కట్టు కట్టారు. పూర్తి వైద్య పరీక్షలు చేశామని, ప్రాణాపాయం లేదని చిన్నపిల్లల వార్డు విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. చిన్నారి పొట్టలో, లోపల శరీర భాగాల్లో గాయాలు తగిలాయా అనేది 48 గంటలు గడిచాక చెప్పగలమన్నారు. అంతవరకు తమ సంరక్షణలో ఉంచుకోవడం అవసరమని తెలిపారు.


ఉలిక్కిపడి లేస్తూ.. బిగ్గరగా అరుస్తూ.. 

ప్రమాద ఘటన నుంచి చిన్నారి ఇంకా తేరుకోలేదు. కొత్త వారిని చూసినా భయపడుతూ కేకలు వేస్తోంది. నిద్రలోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ‘అమ్మా’ అంటూ ఏడుస్తోంది.

Updated Date - 2021-12-07T07:14:25+05:30 IST