ఎలా ముందుకు.. అటు.. ఇటు నలిగిపోతున్న అధికారులు!

ABN , First Publish Date - 2021-02-06T17:59:12+05:30 IST

పంచాయతీ ఎన్నికల వేళ ఈ పరిణామాలతో అధికారులు నలిగిపోతున్నారు.

ఎలా ముందుకు.. అటు.. ఇటు నలిగిపోతున్న అధికారులు!

తిరుపతి : పంచాయతీ ఎన్నికల వేళ ఈ పరిణామాలతో అధికారులు నలిగిపోతున్నారు. చాలామంది అధికారులు, ఉద్యోగులు కొద్ది రోజుల కిందటి వరకూ ఎస్‌ఈసీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు. అధికార పార్టీ ముఖ్య నేతల ఆదేశాలే పరమావధిగా వారు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అయితే ఎస్‌ఈసీ అధికారాలెలా ఉంటాయో గత నెల చివరి వారంలో అనుభవంలోకి వచ్చింది. ఏకంగా కలెక్టర్‌, ఎస్పీ జిల్లాను వీడాల్సి వచ్చింది. వీరి స్థానాల్లో అధికార పార్టీ నేతలతో ప్రమేయం లేని అధికారులు బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాకు వచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ అధికారులకు విస్పష్ట హెచ్చరికలూ జారీ చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.


అదే సమయంలో ఎన్నికలు ముగిశాక మళ్ళీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పని చేయాల్సి ఉండటంతో ఆందోళన పెంచుతోంది. ఎస్‌ఈసీ ప్రభావం తాత్కాలికమైనా, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు విని సాంకేతికంగా తప్పులు చేస్తే కమిషన్‌ తీసుకునే చర్యలు సర్వీసు రికార్డుల్లో నమోదై కెరీర్‌ను ఇబ్బందులకు గురి చేసే ప్రమాదముంది. దీనివల్ల అధికారులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలా మంది అధికారులు, ఉద్యోగులు మాత్రం తమ సర్వీసు, కెరీర్‌ ఇబ్బంది పడకూడదన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఎస్‌ఈసీ ఆగ్రహానికి గురి కాకుండా ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తూ.. అధికార పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. వాటి పర్యవసానమే మంత్రుల స్థాయి కలిగిన నేతలు నేరుగా అధికారులను, ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేసరికి ఇంకేం జరుగుతాయో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందోనని అధికార, ఉద్యోగ వర్గాలు హడలిపోతున్నాయి. ఇప్పటికే జిల్లా ప్రతిష్ట దెబ్బతిన్న నేపధ్యంలో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి. 

Updated Date - 2021-02-06T17:59:12+05:30 IST