వెయ్యికి చేరువైన కొవిడ్ మరణాలు
ABN , First Publish Date - 2021-05-05T07:15:14+05:30 IST
చిత్తూరు జిల్లాలో కొవిడ్ మరణాలు వెయ్యికి చేరువయ్యాయి.

మృతుల్లో పలువురు ప్రముఖులు
తిరుపతి, మే 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ మరణాలు వెయ్యికి చేరువయ్యాయి. కరోనాతో సోమ, మంగళవారాల నడుమ జిల్లాలో పలువురు మృతి చెందారు. కలకడ ఆంధ్రజ్యోతి విలేకరి మారెళ్ల వెంకటా చలపతి (52) మంగళవారం తెల్లవారుజామున రుయాస్పత్రిలో మరణించగా పలమనేరు మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ శేషాద్రి చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందారు. పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడరుగా పనిచేస్తున్న శ్రీరామ్‌రెడ్డి కరోనాతో అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం ఉదయం చనిపోయారు. పుంగనూరు పట్టణ టీడీపీ నేత శ్యామ్ ప్రసాద్ (60) తిరుపతి రుయా ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి మరణించారు. కంభంవారిపల్లె మండల టీడీపీ నేత చింతగింజల శ్రీరామ్ (45) సైతం మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మృతిచెందారు. తొట్టంబేడు మండలం తంగెళ్ళపాలెం ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్‌కృష్ణారెడ్డి (55) సోమవారం అర్ధరాత్రి స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో చనిపోగా శ్రీకాళహస్తి పట్టణం జెట్టిపాలెం ప్రాంతానికి చెందిన రిటైర్డు తెలుగు పండిట్ దీనదయాళ్ నాయుడు (68) చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు. పలమనేరు మండలం తొప్పనపల్లెకు చెందిన అన్నదమ్ములు మాధవ (46), మంజునాధ్ (35)లు బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలో మరణించారు. వీరిలో ఆడిటర్‌గా పనిచేస్తున్న మాధవ సోమవారం రాత్రి చనిపోగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండిన తమ్ముడు మంజునాధ్‌కు సోమవారం ఉదయం అన్న మరణవార్త తెలిసింది. దీంతో షాక్‌కు గురై ఆయన కూడా మరణించారు. ఇరువురి మృతదేహాలనూ కుటుంబీకులు స్వగ్రామానికి తరలిస్తున్నారు.
మళ్లీ రెండు వేలు దాటిన పాజిటివ్‌లు
జిల్లాలో ఒక రోజు గ్యాప్‌తో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు 2 వేలు దాటాయి. సోమ, మంగళవారాల నడుమ 2318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే వ్యవధిలో నలుగురు మృతి చెందినట్టు అధికారిక బులెటిన్ వెల్లడించింది. తాజా కేసులు, మరణాలతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129129కు చేరగా మరణాల సంఖ్య 998కి చేరింది. మరోవైపు జిల్లాలో మంగళవారం ఉదయానికి యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 18956కి చేరుకుంది.
పలమనేరు ప్రభుత్వాస్పత్రికి నిరుపేద ఆక్సిజన్ సిలిండర్ల విరాళం
పలమనేరు ప్రభుత్వాస్పత్రికి మంగళవారం ఓ నిరుపేద పది ఆక్సిజన్ సిలిండర్లు విరాళమిచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. స్థానిక లారీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిలానీ బాషా గతేడాది మార్చిలో లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచీ నేటివరకూ నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జేబులో చిల్లిగవ్వ లేని ఇతడు పట్టణంలో దాతల నుంచీ వస్తురూపంలో విరాళాలు సేకరించి రోజూ పట్టణంలో పేదలకు, కూలీలకు, అనాధలకు భోజనాలు పెడుతున్నారు. విరాళాలతోనే అంబులెన్సు కొనుగోలు చేసి అత్యవసరాల్లో బాధితులకు ఉచితంగా పంపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వాస్పత్రికి 10 ఆక్సిజన్ సిలిండర్లు అందించి ప్రశంసలందుకున్నారు.
పలు కీలక నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచీ రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించిన నేపధ్యంలో జిల్లాస్థాయిలో పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. అందులో భాగంగా తిరుపతిలోని ఎస్వీ జూపార్కును రేపటి నుంచీ మూసివేయనున్నారు. సందర్శకులను అనుమతించకపోగా జంతువుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉద్యోగుల పనివేళలను టీటీడీ కుదించింది. నేటి నుంచీ టీటీడీకి సంబంధించిన పరిపాలనా భవనం, ఇతర విభాగాల్లో ఉదయం 8 గంటల నుంచీ మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. కాణిపాకం, సురుటుపల్లె దేవాలయాన్నింటిలో దర్శన వేళలు మారాయి. ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 12 గంటల నడుమ మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఆర్టీసీకి సంబంధించి ఉదయం 6 గంటలకు డిపో నుంచీ వెళ్ళిన బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు డిపోకు చేరుకునేలా సర్వీసులను కుదించారు. అంతర్రాష్ట్ర, లాంగ్ సర్వీసులను నిలిపివేశారు.