ఎన్‌హెచ్‌-42 రోడ్డు విస్తరణ పనుల భూసేకరణకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-12-30T05:59:06+05:30 IST

ఎన్‌హెచ్‌ - 42 రోడ్డు విస్తరణ పనుల కోసం భూసేకరణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎన్‌హెచ్‌-42 రోడ్డు విస్తరణ పనుల భూసేకరణకు నోటిఫికేషన్‌
ములకలచెరువు - మదనపల్లె జాతీయ రహదారి

 ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు 203 ఎకరాల సేకరణకు నిర్ణయం

ఆక్షేపణలకు 21 రోజుల అవకాశం 


ములకలచెరువు, డిసెంబరు 29: ఎన్‌హెచ్‌ - 42 రోడ్డు విస్తరణ పనుల కోసం భూసేకరణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు జాతీయ రహదారి విస్తరణకు 203 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. దీనిపై ఆక్షేపణలు ఉంటే రైతులు, భూ యజమానులు 21 రోజుల్లోగా రాతపూర్వకంగా ఆధారాలతో పాటు మదనపల్లె సబ్‌కలెక్టర్‌కు అందించాలని సూచించింది. అనంతపురం - చిత్తూరు జిల్లా సరిహద్దు ములకలచెరువు నుంచి మదనపల్లె వరకు ఉన్న 43 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 15న జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.480.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ట్వీట్‌ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన భూ సేరకణకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ములకలచెరువు మండలంలో ములకలచెరువు, కదిరినాధునికోట, పెద్దపాళ్యం, వేపూరికోట, బి.కొత్తకోట మండలంలో బయప్పగారిపల్లె, కోటావూరు, తుమ్మణంగుట్ట, కురబలకోట మండలంలోని కురబలకోట, అంగళ్ళు, తెట్టు, మదనపల్లె మండలంలోని బండమీదకమ్మపల్లె గ్రామాల్లో 203 ఎకరాల భూ సేకరణ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనంతపురం జిల్లా సరిహద్దు నుంచి ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట మండలాల మీదుగా మదనపల్లె వరకు సాగే ఎన్‌హెచ్‌-42 రోడ్డును విస్తరించనున్నారు. అలాగే ములకలచెరువు మండలం బురకాయలకోటలో రద్దీ ఎక్కువగా ఉండడంతో గ్రామం బయట నుంచి రెండు వరుసల బైపాస్‌ రోడ్డును నిర్మించనున్నారు. అలాగే ములకలచెరువు, కొండకింద ఉన్న రైల్వేగేట్లను తప్పించేందుకు ములకలచెరువు నుంచి కదిరినాధునికోట మీదుగా పెద్దపాళ్యం వంతెన వరకు 2.8 కిలో మీటర్లు కొత్తగా రెండు లేన్ల రోడ్డు నిర్మించనున్నారు. దీనికి గానూ ఇందులోనే భూసేరకణ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. భూ సేకరణ పూర్తయితే టెండర్ల పక్రియ ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం రైల్వేగేటు ఉన్న బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వద్ద ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించి ప్రారంభించారు. అలాగే పెద్దపాళ్యం వద్ద ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. మిగిలిన ములకలచెరువు, కొండకింద రైల్వేగేట్లు తప్పించేందుకు రోడ్డు మళ్ళించి కొత్తగా 2.8 కిలోమీటర్ల రెండు వరుసల రోడ్డు నిర్మించనున్నారు. ముంబయి - చెన్నై జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల మళ్ళింపు, బైపాస్‌ రోడ్లు నిర్మాణాలు చేపట్టారు.  రోడ్డు విస్తరణ పనులు, ఓవర్‌ బ్రిడ్జి, బైసాస్‌ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఈ మార్గానికి మహర్దశ చేకూరనుంది.

Updated Date - 2021-12-30T05:59:06+05:30 IST