తప్పుచేస్తే తప్పించుకోలేరు

ABN , First Publish Date - 2021-02-02T05:22:15+05:30 IST

విద్రోహ శక్తులైనా.. పోలీసులైనా తప్పుచేసి తప్పించుకోవాలంటే ఏమాత్రం కుదరదని తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు

తప్పుచేస్తే తప్పించుకోలేరు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వెంకట అప్పలనాయుడు

స్వేచ్ఛకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు

మద్యం, మనీ పంపకాలను పసిగట్టి, అడ్డుకోవాలి 

పోలీసు అధికారులతో తిరుపతి అర్బన్‌ ఎస్పీ 


తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 1: విద్రోహ శక్తులైనా.. పోలీసులైనా తప్పుచేసి తప్పించుకోవాలంటే ఏమాత్రం కుదరదని తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ప్రజల స్వేచ్ఛకు  భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి నగరం ఎస్వీయూ సెనెట్‌హాల్లో సోమవారం సాయంత్రం ఆయన జిల్లా పోలీసు అఽధికారులతో సమావేశమయ్యారు. ‘ప్రతి పరిస్థితి మన పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉంది. ఈ విషయాన్ని  అధికారులు, సిబ్బంది మనసులో పెట్టుకుని పనిచేయాలి’ అని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. నగదు, ఆభరణాలు, మద్యం తదితరాలతో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను సహించొద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరి పనితీరును గమనిస్తుంటారనే విషయాన్ని ఏమాత్రం మరువరాదని హెచ్చరించారు. అలసత్వం వహిస్తే పరిస్థితులు మన చేయిదాటిపోతాయనేది గ్రహించాలన్నారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలవద్ద, జిల్లామొత్తం విజిబుల్‌ పోలీసింగ్‌ను పటిష్టం చేయాలని చెప్పారు. కష్టపడి, క్రమశిక్షణతో పనిచేసేవారికి తన మద్దతు ఉంటుందని ఎస్పీ వెంకట అప్పలనాయుడు చెప్పారు. ప్రజలు భయపడే పరిస్థితులను తాము అనుమతించేది లేదని, అందరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు సుప్రజ (అడ్మిన్‌), మునిరామయ్య (తిరుమల), రాజేంద్రరావు (శాంతి భద్రతలు), డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T05:22:15+05:30 IST