దొరకని సర్కారీ పడక... ప్రైవేటుకు నడక!

ABN , First Publish Date - 2021-05-20T05:55:53+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రిలో పడక దొరక్కపోవడంతో బాధితులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవస్థలు పడుతూ నిరీక్షిస్తున్నారు. చివరికి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లక తప్పడంలేదు. ఎలాంటి సిఫారసు లేనివారు ఆస్పత్రి ఆవరణలో నిరీక్షిస్తూ చేసేది లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

దొరకని సర్కారీ పడక... ప్రైవేటుకు నడక!
ఆస్పత్రి ఆవరణలో పడుకుని వున్న కదిరప్ప

మదనపల్లె క్రైం, మే 19: మదనపల్లె జిల్లా వైద్యశాలలోని కొవిడ్‌ ఆస్పత్రిలో పడక దొరక్కపోవడంతో బాధితులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవస్థలు పడుతూ నిరీక్షిస్తున్నారు. చివరికి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లక తప్పడంలేదు. ఎలాంటి సిఫారసు లేనివారు ఆస్పత్రి ఆవరణలో నిరీక్షిస్తూ  చేసేది లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రోజూ ఇలా ఎంతోమంది బెడ్‌ దొరక్క... ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమించి ఆస్పత్రి ఆవరణలోనే మృత్యువాతపడుతున్నారు. మరికొందరు మార్గమధ్యంలో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా... ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మదనపల్లె మండలం దిగువ కొనగొండ్లవారిపల్లెకు చెందిన కదిరప్ప(70)ఇటీవల కరోనా బారినపడి ఇంటివద్ద కోలుకుంటున్నాడు. ఈక్రమంలో బుధవారం ఆయన పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబీకులు కొవిడ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి బెడ్‌ ఖాళీలేదని చెప్పారు. దీంతో బాధితుడు మధ్యాహ్నం వరకు అక్కడే పడిగాపులు కాశాడు. ఆయాసం, దగ్గు, నీరసం భరించలేక ఆస్పత్రి ఆవరణలో పడుకున్నాడు. అయినా ఆస్పత్రి అధికారులు స్పందించి బెడ్‌ ఇవ్వలేదు. పైగా ఖాళీ అయితే ఇస్తామంటూ కంటితుడుపు మాటలు చెప్పి  పంపించేశారు. ఎంతసేపటికీ బెడ్‌ దొరక్కపోవడంతో  చేసేదిలేక పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆయన్ను కుటుంబీకులు తీసుకెళ్లారు.  కొవిడ్‌ ఆస్పత్రిలో సామాన్యులకు పడక దొరకడం కష్టమైపోయింది. సిఫారసు మేరకు అక్కడి సిబ్బంది అడ్మిట్‌ చేసుకుంటున్నారు. 

Updated Date - 2021-05-20T05:55:53+05:30 IST