పరీక్షించిన నలుగురిలో ఒకరికి!

ABN , First Publish Date - 2021-05-20T06:14:58+05:30 IST

పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉన్నా జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు.

పరీక్షించిన నలుగురిలో ఒకరికి!
చిత్తూరు చర్చి వీధిలో బుధవారం ఉదయం 11గంటలకు కిక్కిరిసిన జనం

29 శాతంగా కరోనా పాజిటివిటీ రేటు

పట్టణాల నుంచి పల్లెలకు పాకిన వైరస్‌

20 చోట్ల కొవిడ్‌ కేంద్రాల ఏర్పాటు


చిత్తూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉన్నా జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. గత 24 గంటల వ్యవధిలో 9135 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే.. 2670 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ లెక్కన పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. పాజిటివిటీ రేటు 29శాతం దాటింది. కోలుకునేవారి సంఖ్య పెరగడంతో యాక్టివ్‌ కేసులు తగ్గుతున్నాయి. ఇది కొంత ఊరట కలిగించే అంశమే అయినా పాజిటివిటీ రేటు పెరుగుతుండడం పట్ల వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వం బులిటెన్‌ ప్రకారం జిల్లాలో పాజిటివిటీ రేటు

రోజు చేసిన నిర్ధారణ పరీక్షలు పాజిటివ్‌ కేసులు శాతం


మంగళవారం 9135 2670        29.22

సోమవారం 10145  2630 25.90

ఆదివారం 6115 1621         26.50


తల్లడిల్లుతున్న పల్లెలు


వైరస్‌ పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించింది. కొన్ని మారుమూల మండలాల్లోనూ రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అయినా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం వైద్య ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది. హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిన వారికి ప్రత్యేక గదులుండే సదుపాయం పల్లెల్లో తక్కువ. ఉన్న ఇంటిలోనే ఓ భాగంలో పాజిటివ్‌ వ్యక్తి ఉండడం, మిగతా భాగంలో కుటుంబ సభ్యులు తిరగడం వల్ల రోజుల వ్యవధిలో వారు కూడా బాధితులుగా మారిపోతున్నారు. ఇది వరకు పాజిటివ్‌ కేసు నమోదైతే ఆరోగ్య, ఆశ కార్యకర్తల పర్యవేక్షణ ఉండేది. వలంటీర్లు సమాచారం ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బాధితులు బయట తిరుగుతున్నా.. ఇంట్లోనే ఉండి వ్యాధి లక్షణాలు ముదిరినా తెలియడం లేదు.


కొవిడ్‌ కేర్‌ సెంటర్లపై ఆసక్తి చూపని బాధితులు


గ్రామీణులకు చికిత్స అందించడంలో, వైరస్‌ బారిన పడినవారిని ఐసొలేషన్‌లో ఉంచడంలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఎంతో కీలకం. నిన్న, మొన్నటి వరకు ఈ కేంద్రాలు అందుబాటులో లేవు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 17 కొవిడ్‌ కేర్‌ సెంటర్లుండగా.. బుధవారం శ్రీకాళహస్తి, మదనపల్లె వంటి ప్రాంతాల్లో మరో మూడు కేంద్రాలను ప్రారంభించారు. దీంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల సంఖ్య 20కి చేరింది. ఈ కేంద్రాల్లో వైద్యుల నియామకం పెద్ద సమస్యగా మారుతోంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సేవలకు వైద్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పడకలు తప్ప.. వైద్య సహాయం అందుబాటులో లేకపోవడంతో ఇక్కడకు చేరేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. 20 కేర్‌ సెంటర్లలో సుమారు 6 వేల పడకలుండగా.. వాటిలో 3300 నిండాయి. దాదాపుగా సగం పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతిలో అత్యధికంగా నాలుగు కేర్‌ సెంటర్లుండగా.. మదనపల్లె, చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, వాల్మీకిపురం, శాంతిపురం, తంబళ్లపల్లె, కలికిరి, చంద్రగిరి, పుంగనూరు, సత్యవేడు వంటి ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లున్నాయి.

Updated Date - 2021-05-20T06:14:58+05:30 IST