గుండోడు చెరువు వద్ద రచ్చ..రచ్చ

ABN , First Publish Date - 2021-10-29T08:21:51+05:30 IST

రామచంద్రాపురం మండలం గుండోడు చెరువుకట్ట వద్ద గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకుఆందోళనలు చేపట్టారు.

గుండోడు చెరువు వద్ద రచ్చ..రచ్చ
ఆర్డీవో కారును అడ్డగించిన ఎస్టీ కాలనీవాసులు

వైసీపీ మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ డిమాండ్‌ 

ఆర్డీవో కారు ముందు ఎస్టీ కాలనీవాసుల బైఠాయింపు 


రామచంద్రాపురం, అక్టోబరు 28: 

గుండోడు చెరువుకట్టను వైసీపీ మట్టిమాఫియా నాయకులే తెగ్గొట్టారు. వారిపై చర్యలు తీసుకోండి. 

- టీడీపీ నాయకుల డిమాండ్‌ 

మేము ఇంటి వద్ద లేనప్పుడు చెరువుకట్టను తొలగించారు. మా బిడ్డలు కొట్టుకుపోయి ఉంటే పరిస్థితి ఏంటి? 

- ఎస్టీ కాలనీవాసుల ప్రశ్న 

చెరువునీటి ఉధ్రుతి మా పొలాలను ముంచెత్తింది. మాకు నష్టపరిహారం చెల్లించండి. 

- ఆయకట్టు రైతుల వినతి 

.. ఇలా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రామచంద్రాపురం మండలం గుండోడు చెరువుకట్ట వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ చెరువుకట్టను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం యంత్రాల సాయంతో తొలగించారు. చెరువునీరు సగానికి పైగా ఖాళీ అయింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు గురువారం ఉదయం చెరువు వద్దకు చేరుకుని పరిశీలిస్తుండగా.. ఆయకట్టు రైతులు, సమీపంలోని ఎస్టీకాలనీ వాసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయానికి చిత్తూరు ఆర్డీవో రేణుక, నీటిపారుదల శాఖ ఈఈ వెంకటశివారెడ్డి అక్కడికి వచ్చి చెరువుకట్టను పరిశీలించారు. చెరువుకట్టను తొలగించిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఢిల్లీనాథ్‌రెడ్డి, నాయకులతో కలిసి ఆర్డీవోను డిమాండు చేశారు. ఆమె సమాధానం చెప్పకుండా బయలుదేరారు. ‘నెల రోజులుగా రాత్రివేళ మట్టి లారీల శబ్దంతో నిద్ర పోలేకపోతున్నాం. శ్మశాన స్థలంలో గుంతలు తీయడం వల్ల శవాలను పూడ్చలేకపోతున్నాం’ అంటూ ఎస్టీ కాలనీవాసులు ఆర్డీవో కారుకు అడ్డంగా బైఠాయించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానంటూ ఆర్డీవో చెప్పినా.. ఇప్పుడే పరిష్కరించాలంటూ భీష్మించారు. దీనికి కొత్తనెన్నూరు నుంచి ఎస్టీ కాలనీవరకు పక్కారోడ్డు, శ్మశాన స్థలం కేటాయిస్తామని ఆర్డీవో హామీ ఇవ్వగా.. లిఖితపూర్వకంగా ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సీఐ అమరనాథరెడ్డి వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. చెరువుకట్టను తొలగించిన వారిని గుర్తించాలని పోలీసులను ఇరిగేషన్‌ ఏఈ సందీప్‌ కోరారు. 


వైసీపీ మట్టిమాఫియాపై చర్యలు తీసుకోండి: టీడీపీ 

నెన్నూరు గుండోడు చెరువు కట్టను తొలగించిన వైసీపీ మట్టిమాఫియా నాయకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, చిత్తూరు పార్లమెంట్‌ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఢిల్లీనాఽథరెడ్డి డిమాండ్‌ చేశారు. గుండోడు చెరువు వద్ద గురువారం వీరు మీడియాతో మాట్లాడారు. ఆరు నెలలుగా వైసీపీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్నారు. చెరువుకు అవతల ఉన్న క్వారీకి దారికోసం చెరువుకట్టను తొలగించడం దారుణమన్నారు. చెరువులో నీళ్లు వెళ్లిపోయిన తర్వాత అందులోని మట్టినీ అమ్ముకునేందుకు ప్లాన్‌ చేశారన్నారు. చెరువునీటి వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు జనార్దనచౌదరి, ధనంయజరెడ్డి, గిరిధరరెడ్డి, రవి, మురళీనాయుడు, నారాయణస్వామినాయుడు, జయచంద్రనాయుడు, రవి, ముని, వసంతనాయుడు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-29T08:21:51+05:30 IST