నూతన సంవత్సరాది వేడుకలు ఇళ్లకే పరిమితం
ABN , First Publish Date - 2021-12-31T08:15:50+05:30 IST
ఈ పర్యాయం నూతన సంవత్సర వేడుకలు ఇళ్ళకే పరిమితం కానున్నాయి.

బహిరంగంగా నిర్వహణకు అనుమతి లేదు
ప్రధాన పట్టణాల్లో పోలీసు పహరా
కొవిడ్ ప్రభావంతో తగ్గనున్న సందడి
తిరుపతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఈ పర్యాయం నూతన సంవత్సర వేడుకలు ఇళ్ళకే పరిమితం కానున్నాయి.కొవిడ్ ప్రభావంతో నూతన సంవత్సర వేడుకల్లో ఈసారి సందడి గణనీయంగా తగ్గనుంది.వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు వీల్లేదంటూ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు ప్రధాన పట్టణాలన్నింటా శుక్రవారం రాత్రి భారీ ఎత్తున పోలీసు బలగాలు పహరా కాయనున్నాయి. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ఎస్పీ సీహెచ్ వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చిత్తూరు డీఎస్పీ సుధాకర రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లెలోనూ ఇవే తరహా హెచ్చరికలను డీఎస్పీ రవిమనోహరాచారి జారీ చేశారు. పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల తర్వాత హోటళ్ళు, రెస్టారెంట్లు మూసివేయాల్సి వుంటుంది. తర్వాత రోడ్లపై బహిరంగంగా కేక్‌లు కట్ చేయడం, నూతన సంవత్సరాదివేడుకలు నిర్వహించడం,కేకలు వేయడం, బాణాసంచా కాల్చడం, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలకు పాల్పడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చిత్తూరులో అయితే ద్విచక్ర వాహనాలపై యువత అల్లరిచేష్టలకు పాల్పడకుండా నగరం చుట్టూ ఆరు మార్గాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటవుతున్నాయి.బయటి ప్రాంతాల నుంచీ నగరంలోకి యువత ద్విచక్ర వాహనాల్లో రాకుండా పోలీసులు అడ్డుకోనున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లు సహా ఎక్కడా బహిరంగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. నూతన సంవత్సర వేడుకలను ఇళ్ళలోనే కుటుంబసభ్యులతో కలసి ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
హార్సిలీహిల్స్‌కు ద్విచక్రవాహనాలు, ఆటోల రాకపై నిషేధం
ప్రముఖ పర్యాటక ప్రదేశమైన హార్సిలీహిల్స్‌కు శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాలను, ఆటోలను అనుమతించేది లేదని మదనపల్లె రూరల్ సీఐ అశోక్‌కమార్ స్పష్టం చేశారు.చివరికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కూడా వుండవు. కేవలం కార్లలో వెళ్ళే వారిని మాత్రమే అనుమతిస్తారు. అది కూడా హిల్స్‌పై ఇదివరకే గదులు బుక్ చేసుకున్న వారినే అనుమతించనున్నారు. దానికి తోడు పర్యాటక శాఖ కూడా ఇదివరకటిలా అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫుడ్ ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివేవీ నిర్వహిచడం లేదు. దీంతో హిల్స్‌పై నూతన సంవత్సర వేడుకలేవీ వుండవు. తిరుపతి శివార్లలోని శిల్పారామంలో మాత్రం నూతన సంవత్సరాది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పరిపాలనాధికారి ఖాదర్‌వలీ తెలిపారు.టీవీ కళాకారులతో హాస్యవల్లరి, సినిమా పాటలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలుంటాయన్నారు.ప్రత్యేక ఫుడ్‌స్టాల్స్ వుంటాయని తెలిపారు. మొత్తంమీద చూస్తే జిల్లాలో ఈ పర్యాయం సందడి, హడావిడి లేకుండా నూతన సంవత్సర వేడుకలు సాగనున్నాయి.
ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు, ఏర్పాట్లు లేవు
జిల్లాలోని ముఖ్యమైన ఆలయాల్లో నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా శుక్రవారం రాత్రి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు గానీ, ఏర్పాట్లు గానీ చేయడం లేదు. జనవరి 1వ తేదీన తెల్లవారుఝామున యధావిధిగా దర్శనాలు ప్రారంభం కానున్నాయి. కాణిపాకంలో వేకువ జామున 3 గంటల నుంచీ దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా వుంటే 9 గంటలు దాటినా కూడా దర్శనాలు కొనసాగిస్తారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శన వేళలకు సంబంధించి ఎలాంటి మార్పుచేర్పులు వుండవు.
బొకేలు తేవద్దు : కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 30: నూతన సంవత్సరాది వేడుకలకు ఈసారి కొంత దూరంగా ఉండాలని కలెక్టర్ హరినారాయణన్ నిర్ణయించారు.క్యాంపు కార్యాలయానికి ఎవరూ రావద్దన్నారు.శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ అధికారులు, శ్రేయోభిలాషులు ఆయన్ను భౌతిక దూరం పాటిస్తూ కలెక్టరేట్‌లో కలిసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.ఆ సమయంలో పుష్పగుచ్ఛాలు, స్వీటు బాక్సులు, పండ్ల బుట్టలు వంటివి ఇచ్చేందుకు తీసుకురావొద్దంటూ అధికారులకు వాట్సాప్ సందేశాలను పంపారు.