దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-08-26T05:01:13+05:30 IST

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్‌ పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సప్తగిరి ప్రసాద్‌ విమర్శించారు.

దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న నారాయణస్వామి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల విమర్శ 


చిత్తూరు సిటీ, ఆగస్టు 25: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్‌ పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సప్తగిరి ప్రసాద్‌ విమర్శించారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి తన అనుచరుల అక్రమాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు జరుగుతుంటే పట్టించుకోని దళిత నేత నారాయణస్వామి ఉపముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ జైలుకు పోకుండా ఉండడానికి బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారని, ఇది గుర్తించుకుండా ఉపముఖ్యమంత్రి పొత్తు లేకుండా టీడీపీ గెలవలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేస్తున్న ఇసుక దోపిడీ, అక్రమ మద్యం వ్యాపారంపై ప్రమాణం చేయడానికి పిలిస్తే, దానికి స్పందించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్‌ రాజ్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు షణ్ముగం, చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్‌, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు మాధవ నాయుడు, నగర ప్రధాన కార్యదర్శి దుర్గాచౌదరి, మేషాక్‌, మంజూస్‌, కుప్పయ్య, రాజు, కందస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:01:13+05:30 IST