అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూమిని అమ్మేశారు

ABN , First Publish Date - 2021-10-29T07:22:44+05:30 IST

మూడు దశాబ్దాల క్రితం మదనపల్లెలో ఒక వెలుగు వెలిగిన అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ స్థలం పరాధీనమైంది

అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూమిని అమ్మేశారు

 మూడు దశాబ్దాల క్రితం మదనపల్లెలో ఒక వెలుగు వెలిగిన అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ స్థలం పరాధీనమైంది. రకరకాల కారణాలతో స్థాపించిన పదేళ్లలోపే మూతబడ్డ ఈ ఫ్యాక్టరీ కోసం నిర్మించిన రేకులషెడ్లు,పదిమంది కార్మికులకోసం,మరో పదిమంది సహాయకుల కోసం నిర్మించిన షెడ్లు, ఇళ్లు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి.వీరిలో కొంతమంది ఇక్కడే తలదాచుకుంటున్నారు.ఫ్యాక్టరీ చుట్టూ భూములు నివాసప్రాంతాలుగా మారిపోవడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి.దీంతో రియల్టర్ల కన్ను పడింది.వారికి రాజకీయ బలమూ తోడైంది. ఇంకేముంది. దళారులు రంగప్రవేశం చేశారు.అక్కడున్న కార్మికులను నయానో, భయానో ఒప్పించారు.ఖాళీ స్థలాన్ని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. రూ.కోట్ల విలువ చేసే ఆ భూమిని చదును చేసి, ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు.


మదనపల్లె, అక్టోబరు 28: మదనపల్లె మండలం బసినికొండ రెవెన్యూగ్రామం సర్వే నెంబర్‌: 679-బిలోని 2.87ఎకరాలను పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.ఎన్‌.రఘునాథరెడ్డి అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ కోసం 1982వ సంవత్సరం మే 25వతేదీన డాక్యుమెంట్‌ నెంబర్‌:2831-1982దాన దస్తావేజు కింద రిజిస్ర్టేషన్‌ చేయించారు.ఎందరో వ్యక్తులకు, మరెన్నో సంస్థలకు భూములను దానంగా ఇచ్చిన రఘునాథరెడ్డి బ్రిటీష్‌ కాలంలోనే పట్టణంలో విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారు.మదనపల్లె కార్యవిద్యాలయం శ్రీమోరీస్‌ ప్రైమరీ స్కూల్‌ ఉరఫ్‌ భారతనందిని పేరుతో సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ పేరుతోనే బీటీ కళాశాలకు అనుబంధంగా ప్రస్తుతం ప్రెస్‌క్లబ్‌ నడుస్తున్న భవనంలో పాఠశాలను నడిపినట్లు చెబుతున్నారు. ఈయన అనంతరం అది మూతపడింది.ఈ ట్రస్టుకు సెక్రటరీగా ఉన్న రఘునాథరెడ్డి.. పట్టణానికి చెందిన వడ్ల సుబ్బాచారి నుంచి 1956వ సంవత్సరం డిసెంబరు ఒకటో తేదీన డాక్యుమెంట్‌ నెంబర్‌:4724-1956లో కొనుగోలు చేసిన 2.87 ఎకరాలను మ్యాచస్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌కు దానంగా ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాను ఇచ్చిన జమీనులో మ్యాచ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ నడుపుకోవాలని, లేకుంటే సదరు జమీను తిరిగి సదరు కార్యవిద్యాలయానికే అప్పగించాలని కండీషన్‌లో భాగంగా దానదస్తావేజులో పొందుపరిచారు. అయితే ఈ విషయాన్ని అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ భూమిని ఇటీవల అమ్మేముందు కార్మికులూ పట్టించుకోలేదు. కొనుగోలు చేసిన రియల్టర్లు కూడా ఖాతరు చేయలేదు. అసోసియేషన్‌లో పదిమంది సభ్యులుండగా, అందులో తొమ్మిదిమంది రిజిస్ర్టేషన్లు చేయించారు. ఎందుకంటే భూదాత మరణించడం, ఆయన వారసులంతా అమెరికాలో 

స్థిరపడటం కూడా వీరికి కలిసొచ్చింది. ఇందుకు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ అధికారులూ సహకారం అందించారు.సాధారణంగా ఒక సొసైటీ లేదా సంఘం ఏర్పాటయ్యాక, వివిధ కారణాలతో కార్యక్రమాలు ఆగిపోయి మూత పడితే, తర్వాత సంఘంలోని సభ్యులకు ఆస్తి చెందుతుంది.ఎవరూ లేకుంటే దానికి సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందాల్సివుంది.ఇలాంటి భూమిని విక్రయించేశారు కార్మికులు.మొత్తం 2.87ఎకరాల భూమిలో ఎకరాకు పైగా విక్రయించేశారు.

రిజిస్ర్టేషన్లు వీరిపేరిటే....

 తంబళ్లపల్లె మండలం మండెంవారిపల్లెకు చెందిన చిట్టెం శివప్రసాద్‌కు వర్కర్స్‌ అసోసియేషన్‌  అధ్యక్షుడిగా చెబుతున్న ఎం.చలపతి, కార్యదర్శి జె.నరసింహులు, ట్రెజరర్‌ వి.ఆర్‌.తులసమ్మతో పాటు సభ్యులు టి.నరసింహులు, ఎస్‌.జయమ్మ, ఎం.చంద్రమోహన్‌, యు.రఘునాథ్‌, ఎం.విజయ్‌కుమార్‌, బి.మునస్వామి ఈ ఏడాది జూలై 14వతేదీన డాక్యుమెంట్‌ నెంబర్‌:5761తో రిజిస్ర్టేషన్‌ చేశారు. మదనపల్లె పట్టణం గొల్లపల్లెకు చెందిన పఠాన్‌ రహీంకు కూడా అదే తొమ్మిదిమంది కార్మికులు అదే రోజు డాక్యుమెంట్‌ నెంబర్‌:5764తో రిజిస్ర్టేషన్‌ చేశారు.ఆ మరుసటి రోజు పట్టణానికి చెందిన ఆర్‌.జవహర్‌బాషాకు డాక్యుమెంట్‌ నెంబర్‌:5763తో, పఠాన్‌ అన్వర్‌ఖాన్‌కు డాక్యుమెంట్‌ నెంబర్‌:5762తో రిజిస్ర్టేషన్‌ చేశారు. మదనపల్లె పట్టణం ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన మల్లేపల్లె సురేంద్రకుమార్‌రెడ్డికి గత నెల 27వతేదీన డాక్యుమెంట్‌ నెంబర్‌:8503తో అయిదు ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేశారు.


Updated Date - 2021-10-29T07:22:44+05:30 IST