కొవిడ్‌ సేవకులకు మంగళం

ABN , First Publish Date - 2021-10-07T07:12:34+05:30 IST

కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో వారంతా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. కొందరేమో కరోనా బాధితుల ప్రాణాలు పోకుండా చికిత్స చేయగా.. మరికొందరు కరోనా వార్డుల్లో శుభ్రతా చర్యలు చేపట్టారు. ఇంతలా కష్టపడినా.. మూడు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఒప్పందం ప్రకారం వారిని నియమించుకుని ఆరు నెలల కాలం పూర్తయిందనే కారణం చూపించి జిల్లాలోని కొవిడ్‌ సేవకులను తొలగిస్తున్నారు.

కొవిడ్‌ సేవకులకు మంగళం

జీతం కూడా ఇవ్వకుండానే 1200 మంది తొలగింపు


వైద్యుల నుంచి స్వీపర్ల వరకు.. అందరూ బాధితులే


ఆరు నెలలు పూర్తయిందనే కారణం చూపిస్తూ ఉత్తర్వులు


చిత్తూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో వారంతా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. కొందరేమో కరోనా బాధితుల ప్రాణాలు పోకుండా చికిత్స చేయగా.. మరికొందరు కరోనా వార్డుల్లో శుభ్రతా చర్యలు చేపట్టారు. ఇంతలా కష్టపడినా.. మూడు నెలలుగా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఒప్పందం ప్రకారం వారిని నియమించుకుని ఆరు నెలల కాలం పూర్తయిందనే కారణం చూపించి జిల్లాలోని కొవిడ్‌ సేవకులను తొలగిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారుల సూచన మేరకు డీఎంహెచ్‌వో శ్రీహరి బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇలా జిల్లాలో సుమారు 1200 మంది కొవిడ్‌ సేవకులు గురువారం నుంచి ఇళ్లకు వెళ్లనున్నారు.


ఇప్పుడు కొందరు.. నవంబరులో మరికొందరు ఇళ్లకు..


కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వైద్య సిబ్బంది కొరతతో బాధితులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటికప్పుడు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకుంది. డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, స్పెషలిస్టులు, స్టాఫ్‌ నర్శులు, అనస్థీషియా టెక్నీషియన్లు, ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు, స్వీపర్లను ఏడాది పాటు పనిచేయాలని తాత్కాలిక ప్రాతిపదికన 2020 నవంబరులో నియమించుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరు నెలల పాటు పనిచేయాలని తాత్కాలిక పద్ధతిలో మరికొందరిని నియమించుకున్నారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో నియమించుకున్న 1200 మంది ఆరు నెలల సమయం అక్టోబరు 7వ తేదీతో ముగియనుంది. దీంతో వారంతా నేటి నుంచి ఇళ్లకు వెళ్లనున్నారు. అలాగే ఫస్ట్‌ వేవ్‌లో నియమించుకున్న సుమారు వెయ్యి మంది సిబ్బంది ఏడాది సమయం కూడా వచ్చే నవంబరు 23వ తేదీతో ముగియనుంది. వారిని కూడా ఇంటికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


తొలగించమని రాష్ట్ర అధికారుల ఆదేశాలు


కొవిడ్‌ సమయంలో తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్న సిబ్బందిని వారి గడువు ముగిసిన తర్వాత తొలగించాలని మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో రాష్ట్ర అధికారులు సూచించారు. బుధవారం డీఎంహెచ్‌వో విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆరు నెలల గడువు ముగిసిన సిబ్బందిని తొలగిస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆంధ్రజ్యోతితో ధృవీకరించారు. 


మూడు నెలలుగా అందని జీతాలు


తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్న వైద్యులు, సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు కూడా రాలేదు. తాజాగా ఇంటికి పంపిస్తున్న 1200 మందిలో చాలా మందికి మూడు, మరికొంతమందికి రెండు నెలలుగా జీతాలు అందలేదు. అయినా ఇంటికి పంపించేస్తున్నారు. స్వీపర్లకు రూ.10 వేలు, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలకు రూ.12 వేలు, అనస్థీషియ టెక్నీషియన్లకు రూ.25, స్టాఫ్‌ నర్శులకు రూ.35 వేలు, ఎంబీబీఎస్‌ డాక్టర్లకు రూ.72 వేలు, స్పెషలిస్టులకు రూ.1.50 లక్షలు చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు.

Updated Date - 2021-10-07T07:12:34+05:30 IST