అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2021-06-21T06:36:02+05:30 IST

చంద్రగిరి మండలం ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలోని గజేంద్రనగర్‌ సమీపంలో ఉన్న బావిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బావిలో మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు - మల్లీశ్వరి (ఫైల్‌ఫొటో)

చంద్రగిరి, జూన్‌ 20: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలోని గజేంద్రనగర్‌ సమీపంలో ఉన్న బావిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏర్పేడు మండలం ఇసుక తాబేలు గ్రామానికి చెందిన గురవయ్య భార్య మల్లీశ్వరి(55)కి ఇద్దరు కుమారులున్నారు. ఏడేళ్ల కిందట భర్తతో విభేదించి తన సోదరుడైన మహేష్‌ దగ్గరికొచ్చేశారు. మహేష్‌ గతంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని కమ్యూనికేషన్‌ విభాగంలో పనిచేసేవాడు. ప్రస్తుతం ఎ.రంగంపేటలో కాపురం ఉంటూ.. జెరాక్స్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున మహేష్‌, తిరుపతికి చెందిన బాష ద్విచక్ర వాహనంపై గజేంద్రనగర్‌ సమీపంలోని అటవీప్రాంతం వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో నిఘాలో ఉన్న చామలరేంజ్‌ ఎఫ్‌బీవో రవీంద్ర తన సిబ్బందితో కలిసి వారిద్దరినీ చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో.. తన సోదరి కరోనా వైరస్‌తో మృతి చెందడంతో గజేంద్రనగర్‌ సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహాన్ని పడేసినట్లు మహేష్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే మృతదేహాన్ని మహేష్‌ ఇంట్లోనే మూడ్రోజులుగా ఉంచినట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న మల్లీశ్వరి భర్త మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య మృతిపై విచారించి, న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-21T06:36:02+05:30 IST