యాజమాన్య వైఫల్యమే

ABN , First Publish Date - 2021-08-28T05:00:46+05:30 IST

మూడు కోట్ల రూపాయల స్వాహాతో రచ్చకెక్కిన కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో తలెత్తిన సంక్షోభానికి పూర్తిగా యాజమాన్య వైఫల్యమే కారణమని తేటతెల్లమవుతోంది.

యాజమాన్య వైఫల్యమే
తమ ఖాతాల వివరాలు తెలుసుకునేందుకు బాంకుకు వచ్చిన మహిళలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సంక్షోభానికి కారణమిదే 

కలికిరి, ఆగస్టు 27: మూడు కోట్ల రూపాయల స్వాహాతో రచ్చకెక్కిన కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో తలెత్తిన సంక్షోభానికి పూర్తిగా యాజమాన్య వైఫల్యమే కారణమని తేటతెల్లమవుతోంది. ఏడేళ్ళ క్రితం ఇదే బ్యాంకులో రూ.30 లక్షల స్వాహా జరిగినా చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఫలితంగానే ఇప్పుడు రూ.కోట్ల స్థాయికి చేరిందని చెబుతున్నారు. అప్పటికే బ్యాంకులో తాత్కాలిక పద్ధతిపై మెసెంజరుగా పనిచేస్తున్న అబ్దుల్‌ ఆలీ ఖాన్‌ ఈ ఉదంతం నుంచే అనుభవాలను వంటబట్టించుకున్నాడని ఆంధ్రజ్యోతి పరిశీలనలో స్పష్టమయ్యింది. బ్యాంకులో వరుసగా పనిచేసిన మేనేజర్ల నిర్లిప్తత, ఆలీకి ఇచ్చిన మితిమీరిన ప్రాధాన్యత బ్యాంకు కొంపమీదకు తెచ్చిందని తేలుతోంది. వచ్చిన ప్రతి మేనేజరు ఆలీని నెత్తిన పెట్టుకోవడంతో మిగతా బ్యాంకు సిబ్బంది కూడా అదే వరుస కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులంతా ఏ చిన్నపాటి పనికైనా నేరుగా ఆలీ దగ్గరికే వెళ్ళి చక్కబెట్టుకోవడం అలవాటుగా మారింది. 

గుణపాఠం నేర్చుకోని యాజమాన్యం

సాధారణంగా ఏ బ్యాంకులోనైనా ఆర్థిక విషయాల్లో అక్రమాలు వెల్లడయితే పరిణామాలు తీవ్రంగా వుంటాయనేది అందరిలో వుండే అభిప్రాయం. అయితే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాజమాన్యం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఏడేళ్ళ క్రితం అంటే 2014 జూన్‌ నెలలో దాదాపు రూ. 30 లక్షల పైబడిన గోల్‌మాల్‌ వ్యవహారం ఒకటి బయటపడింది. కె.రెడ్డివారిపల్లెకు చెందిన డ్వాక్రా గ్రూపులకు చెందిన రూ.30 లక్షల స్వాహా జరిగింది. ముగ్గురు సంఘమిత్రలు, అప్పటి బాంకు క్యాషియరు (ఇతనూ కలికిరివాసే) కుమ్మక్కై ఈ మొత్తం కాజేశారని  విచారణలో తేలింది. కొంత మంది స్థానికుల అండతో క్యాషియరు స్వాహా జరిగిన మొత్తాన్ని తిరిగి చెల్లించేసి చర్యల నుంచి తప్పించుకున్నాడు. సంఘ మిత్రలను బాధ్యతల నుంచి తొలగించారు. క్యాషియరుపై చర్యలూ లేకుండా బదిలీతో సరిపెట్టారు. అనంతరం ఆయనకు మేనేజరుగా పదోన్నతి కూడా ఇచ్చా రు. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షిగా వున్న ఆలీ ఖాన్‌ బ్యాంకు ఉన్నతాధికారుల బలహీనతలను ఔపోసనపట్టి కొత్త అనుభవాలను వంటబట్టించుకున్నాడు. రెండేళ్ళ తరువాత నుంచి అంటే 2016 ఆఖరు నుంచి చేతివాటానికి పని చెప్పడం ప్రారంభించారు.నగలు చేయించాలన్న తన కుటుంబ సభ్యుల వత్తిడితో ఈ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో మెసెంజరు వెల్లడించినట్లు సమా చారం. అయితే ఖాతాదారులకు చెల్లించడానికి 750 గ్రాముల బంగారు తాకట్లు పెట్టానని అంగీకరించినట్లు కూడా తెలిసింది. ఈ ముప్పావు కిలో బంగారం ఖాతా దారులకు చెందినదా లేక అక్రమ లావాదేవీల ద్వారా పొందిన డబ్బుతో కొన్నదా అనే విషయంలో స్పష్టత లేదు. 

స్తంభించిపోయిన నగదు లావాదేవీలు

మెసెంజరు ఆలీ ఖాన్‌ పోలీసుల అదుపులో విచారణను ఎదుర్కొంటుండగా శుక్రవారం వందలాదిమంది ఖాతా దారులు ఆందోళనతో బ్యాంకు ముందు క్యూ కట్టారు. గురువారం పదుల సంఖ్యలో డబ్బు చెల్లించి తాకట్టులో వున్న బంగారాన్ని తీసుకుపోగా, శుక్రవారానికి ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది. అప్పోసప్పో చేసి బంగారాన్ని విడిపించుకుపోయి వేరే బ్యాంకుల్లో తిరిగి తాకట్టు పెట్టేసి ఆ డబ్బును తెచ్చిన చోట చెల్లించి ఊపిరి పీల్చుకోవడం కనిపించింది. ఇక డిపాజిట్లున్న వారు బాండ్లు తెచ్చి నిల్వలను పరిశీలించుకున్నారు. మరి కొంత మంది డిపా జిట్లు వాపసు తీసుకున్నారు. బంగారును తాకట్టు నుంచి విడిపించుకోవడానికి చెల్లించిన డబ్బును డిపాజిట్‌దార్లకు సర్దుబాటు చేశారు.వ్యక్తిగత ఖాతాదారులను పట్టించుకొనే వారే లేరు. ప్రింటర్లు పనిచేయడం లేదనే సాకులు మళ్ళీ మొదలయ్యాయి. దీంతో తమ ఖాతాల్లోని డబ్బు గురించి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు.

డ్వాక్రా గ్రూపుల్లో తనిఖీలు ముమ్మరం

మరో వైపు అత్యధికంగా మూల్యం చెల్లించుకున్న డ్వాక్రా గ్రూపుల్లో ఎంత మేర స్వాహా జరిగిందీ తేలడం లేదు. శుక్రవారం డీఆర్‌డీఏకి చెందిన రెండు బృందాలు గ్రూపుల లెక్కలు పరిశీలించారు. ఏరియా కో ఆర్డినేటర్‌ రూతు, ఏపీఎం సుబ్రమ ణ్యం ఆధ్వర్యంలో పదిమందితో కూడిన రెండు బృందాలు తనిఖీ చేశాయి. ఒక్కో టీముకు చిత్తూరు నుంచి వచ్చిన ఒక్కో ఆడిట్‌ అధికారి నేతృత్వంలో ఈ తనిఖీలు మొదలు పెట్టారు.మొత్తం బ్యాంకుకు సంబం ధించి 224 గ్రూపులున్నాయి. అందులో మర్రికుంటపల్లెకు చెందిన 17 గ్రూపుల లావాదేవీలను శుక్రవారం పరిశీలించారు.వీటిలో కొత్తగజ్జలవారిపల్లెలో పది గ్రూపు లకు సంబంధించి మొత్తం రూ.64 లక్షలు స్వాహా జరిగి నట్లు తేల్చారు. ఇంకా 207 గ్రూపుల లెక్కలు చూడాల్సి వుంది. మిగిలిన వాటిలో కూడా ఇదే విధమైన స్వాహా జరుగుంటే ఆ మొత్తం రూ. కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ వుండొచ్చని అంచనా వేస్తున్నారు. స్టేట్‌మెంట్లు అందజేసే విషయంలో బ్యాంకు అధికారులు సహకరిం చకపోవడంతో తనిఖీలు ముందుకు సాగడం లేదని ఏసీ రూతు తెలిపారు. పూర్తి చేయడానికి మరో మూడు నాలుగు రోజులు పట్టొచ్చని చెప్పారు.

 పొదుపు డబ్బు మొత్తం పోయింది

తమ గ్రూపులో సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బు రూ.3,38,000 చేతులు మారిపోయిందని మజ్జిగవాండ్లపల్లె స్వాతి గ్రూపు లీడర్లు చంద్రకళ, అనసూయ పేర్కొన్నారు. ఆలీ ఖాన్‌ భార్య పేరుతో ఇది ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందని వాపోయారు. ఇక తీసుకున్న రుణాల సంగతి తేలాల్సి వుందని తెలిపారు.

Updated Date - 2021-08-28T05:00:46+05:30 IST