భార్య కాపురానికి రాలేదని సెల్‌టవర్‌ ఎక్కాడు!

ABN , First Publish Date - 2021-12-25T05:52:24+05:30 IST

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన ఓ భర్త సెల్‌టవర్‌ ఎక్కాడు. అత్తింటివారిపై వేధింపుల కేసు నమోదు చేస్తే గానీ దిగనన్నాడు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో మూడుగంటల తరువాత కిందకు దిగొచ్చాడు.

భార్య కాపురానికి రాలేదని సెల్‌టవర్‌ ఎక్కాడు!
సెల్‌టవర్‌ ఎక్కిన క్రాంతికుమార్‌

అత్తింటివారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ 


మూడుగంటల తరువాత దిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు


మదనపల్లె క్రైం, డిసెంబరు 24: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన ఓ భర్త సెల్‌టవర్‌ ఎక్కాడు. అత్తింటివారిపై వేధింపుల కేసు నమోదు చేస్తే గానీ దిగనన్నాడు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో మూడుగంటల తరువాత కిందకు దిగొచ్చాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన క్రాంతికుమార్‌కు 2019లో మదనపల్లె మండలం కొత్తపల్లెకు చెందిన ప్రమీలతో వివాహమైంది. వీరికి 16 నెలల కుమార్తె ఉంది. పట్టణంలోని బుగ్గకాలువలో నివాసం ఉంటున్నారు.  క్రాంతికుమార్‌ పెయింటర్‌. 20 రోజుల కిందట భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయింది.  క్రాంతి గురువారం అత్తారింటికెళ్లి భార్యను కాపురానికి రమ్మని పిలిచాడు. రానని  చెప్పడంతో భార్య, అత్తింటివారితో గొడవపడి ఇంటికి వచ్చేశాడు.  శనివారం రాజీవ్‌నగర్‌లోని ఓ సెల్‌టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌, తాలూకా పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతోపాటు క్రాంతికుమార్‌ కుటుంబీకులను విచారించారు. భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందన్నారు.  అనంతరం పోలీసులు క్రాంతికి ఫోన్‌చేసి కిందకు దిగాలని కోరారు. తన భార్య, కుమార్తెను తీసుకొస్తే దిగతానని చెప్పడంతో పోలీసులు వెళ్లి వారిని తీసుకొచ్చారు. ఆ తరువాత భార్యను కాపురానికి పంపకుండా వేధించిన అత్త అరుణమ్మ, బామ్మర్ది పుష్పరాజ్‌పై కేసు నమోదు చేస్తేనే కిందకు దిగొస్తానని తేల్చి చెప్పాడు. ఈక్రమంలో పోలీసులు ప్రమీల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు టవర్‌ ఎక్కిన క్రాంతి మధ్యాహ్నం 1.30 గంటలకు కిందకు దిగొచ్చాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ మాట్లాడుతూ... తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లినప్పుడల్లా అత్తింటివారు మానసికంగా వేధిస్తున్నారని చెప్పాడు.  కాగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు నూర్‌ఆజాం, జింకా వెంకటాచలపతి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి సర్దిచెప్పారు. అనంతరం పోలీసులు క్రాంతి సహా ఆయన భార్య, కుమార్తె, అత్తింటివారిని  స్టేషన్‌కు తరలించారు. అనంతరం రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపించారు. తాలూకా ఎస్‌ఐ సోమశేఖర్‌, అగ్నిమాపక అధికారి మాబుసుభాన్‌, తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు, వన్‌టౌన్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T05:52:24+05:30 IST