‘మదనపల్లె’ జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్‌

ABN , First Publish Date - 2021-04-28T05:36:28+05:30 IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘మదనపల్లె’ జంట హత్య కేసులో నిందితులైన పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులకు మంగళవారం న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

‘మదనపల్లె’ జంట హత్యల కేసులో   నిందితులకు బెయిల్‌
జైలు నుంచి బయటకు వస్తున్న దంపతులు

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘మదనపల్లె’ జంట హత్య కేసులో నిందితులైన పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులకు మంగళవారం న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌కు చెందిన పురుషోత్తంనాయుడు, పద్మజ మూఢనమ్మకాలతో తమ ఇద్దరు కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యను జనవరి 24న హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాలూకా పోలీసులు 26న నిందితులను అరెస్టు చేసి స్థానిక స్పెషల్‌ సబ్‌జైలుకు తరలించారు.  జైలులో దంపతుల మానసికస్థితి సరిగా లేకపోవడంతో మానసిక వైద్యనిపుణుల సూచనల మేరకు ఫిబ్రవరి 3న విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం అక్కడి వైద్యాధికారులు మార్చి 29వ తేదీన డిశ్చార్జి చేయడంతో 30వ తేదీన తిరిగి మదనపల్లె సబ్‌జైలుకు చేరుకున్నారు. సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరికి రెండో ఏడీజే కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో బంధువులు జైలు వద్దకు చేరుకుని దంపతులను కారులో తీసుకెళ్లారు. వీరిని శివనగర్‌లోని సొంతింటికి కాకుండా, పురుషోత్తం నాయుడు స్వగ్రామమైన తవణంపల్లె మండలం కొండ్రాజుకాలువకు తీసుకెళ్లారు. కాగా కోర్టు బెయుల్‌ మంజూరు చేయగానే పురుషోత్తంనాయుడు సోదరుడు శివనగర్‌కు వెళ్లి దంపతులకు కావాల్సిన లగేజీని సిద్ధం చేసి ఉంచాడు. బెయిల్‌ ఉత్తర్వులు జైలుకు చేరిన వెంటనే ఇంటికెళ్లి అక్కడే ఉన్న శునకాన్ని కారులో ఎక్కించుకుని జైలు వద్దకొచ్చాడు. విడుదలైన దంపతులను తీసుకొని నేరుగా స్వగ్రామానికి వెళ్లినట్లు వారి తరపు బంధువులు చెప్పారు.

Updated Date - 2021-04-28T05:36:28+05:30 IST