హంద్రీ- నీవాకు నీళ్లొదిలేశారు..!

ABN , First Publish Date - 2021-10-25T07:21:00+05:30 IST

ప్రధాన కాలువ వెంబడి అధికారుల పర్యవేక్షణ లేదు.

హంద్రీ- నీవాకు నీళ్లొదిలేశారు..!

పక్క జిల్లాలో వృథాగా కృష్ణా జలాలు

గండ్లు పూడ్చలేక చేతులేత్తేసిన అధికారులు 


ప్రధాన కాలువ వెంబడి అధికారుల పర్యవేక్షణ లేదు. ఫలితం.. అనంతపురం జిల్లాలో పలువురు రైతులు, కొందరు నేతల సహకారంతో నీటిని మళ్లించేస్తున్నారు. కాలువకు గండ్లుపెడుతున్నారు. దీనివల్ల నీళ్లు వృథాగా పోతున్నాయి. వర్షాలు పుష్కలంగా పడి చెరువులు కుంటలు నిండినా, హంద్రీ-నీవా జలాలను దారి మళ్లిస్తూ వృఽథా ప్రవాహానికి కారణమవుతున్నారు. వీటి నేపథ్యంలో శ్రీశైలం నుంచి ఐదు నెలలుగా నీటిని తీసుకుంటున్నా.. అందులో నుంచి మనవాటా నీళ్లు మనకు రావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు నిధులు రాక, గండ్లు పూడ్చకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. 

- మదనపల్లె


హంద్రీ- నీవా రెండో విడత పనులు పూర్తయిన తర్వాత ఈ ఏడాదితో వచ్చే కృష్ణా జలాలు నాలుగోసారి. ఈసారి ముందస్తు వర్షాలు కురవడం, శ్రీశైలం డ్యాం కూడా ఇప్పటికే మూడుసార్లు మొరవపోవడంతో ముందస్తుగా నీటిని తీసుకోవచ్చని భావించారు. అధికారులు అనుకున్నట్లు శ్రీశైలం నుంచి వాటానీటిని తోడుకుంటున్నా.. అనంతపురం జిల్లా ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో  కృష్ణమ్మ పరుగులకు పగ్గాలు వేస్తున్నారు. ఇదిలావుండగా, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు చెర్లోపల్లె ఎగువ భాగాన ప్రధాన కాలువ అక్కడక్కడా తెగిపోవడం, వాటికి మరమ్మతులు చేపట్టడం, తర్వాత రైతులు కాలువకు గండ్లు పెట్టడం షరా మామూలైంది. ఎక్కడికక్కడ కాలువల వెంబడి పర్యవేక్షణ లేకపోవడం, దీనికితోడు రాజకీయ ఒత్తిళ్లు అధికం కావడంతో అధికారులు చేతులేత్తేశారు. ఫలితంగా మన జిల్లాకు రావాల్సిన పది టీఎంసీలను పక్కన పెడితే, అక్కడి అధికారులు కోరినట్లు నాలుగు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.


శ్రీశైలం నుంచి జీడిపల్లె రిజర్వాయరుకు 1900 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, జీడిపల్లె నుంచి దిగువకు 1080 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. మరో 200 క్యూసెక్కులు ప్రవహించే సామర్థ్యమున్నా కాలువల భద్రతను దృష్టిలో పెట్టుకుని హంద్రీ-నీవా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే చెర్లోపల్లె రిజర్వాయరుకు 160 క్యూసెక్కులు, గొల్లపల్లె రిజర్వాయరుకు 200 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, మిగిలిన సరఫరాలో కొంత నష్టాలు పోగా, మధ్యలో అవసరం లేకున్నా యఽథేచ్ఛగా కాలువకు గండ్లు పెడుతున్నారు. చెర్లోపల్లె రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 1.60 టీఎంసీలు కాగా, 1.20 టీఎంసీలు చేరితేనే, దిగువనున్న మన జిల్లాకు వదలడానికి ఆస్కారం ఉంది. అయితే నెలరోజులైనా 0.60 టీఎంసీలు చేరడం లేదు. ఫలితంగా అక్టోబరు మొదటివారంలోనే జిల్లాకు రావాల్సిన నీటికి బ్రేక్‌ పడింది. నవంబరు మొదటి, లేక రెండోవారంలో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నా,  ఎగువ ప్రాంతంలో నీటిచౌర్యంపై ఆధారపడి ఉంటుందన్నది అక్షర సత్యం. ఈ మూడు నియోజకవర్గాల్లో పనులు చేయించిన ఈఈ రమే్‌షబాబు, ఆపై షెడ్యూల్‌ ప్రకారం నీటిని ముందుకు నడిపించడంలో విఫలమయ్యారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడ రైతులు, రాజకీయ నాయకులు కాలువలకు గండ్లు పెడుతున్నట్లు చెబుతున్నారు. 


మరమ్మతులకు డబ్బులేవీ? 


కాలువ తెగిపోయినా, రైతులు గండ్లు పెట్టినా వాటికి మరమ్మతులు చేయడానికి కనీసం రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతోంది. ఇందుకు ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. పోనీ కాంట్రాక్టర్ల చేత చేయిద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. టెండర్ల పద్ధతిన కాకపోయినా నామినేషన్‌పై చేయడానికి కాంట్రాక్టర్లే కాదు.. స్థానిక రాజకీయ నాయకులూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఆ మూడు నియోజకవర్గాల్లో 20 చోట్లకుపైగా గండ్లు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీటన్నింటినీ ఇప్పటికే ఏదో విధంగా రెండుసార్లు మరమ్మతులు చేశారు. ఈ పరిస్థితుల్లో హంద్రీ-నీవా అధికారులే నీటి ప్రవాహాన్ని ముందుకు నడిపించడంలో చేతులేత్తిసినట్లు తెలుస్తోంది. తమ వాటా నీటిని వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరుతూ మదనపల్లె సర్కిల్‌ ఎస్‌ఈ ఎస్‌.దేశీనాయక్‌ ఇప్పటికే అనంతపురం సీఈ, ఎస్‌ఈలకు మూడుసార్లు లేఖలు రాశారు. కానీ అక్కడి అధికారులు పట్టించుకోలేదు. 


ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపితేనే.. 


అనంతపురం జిల్లాలో కాలువల వెంబడి నిఘా పెట్టడం, దాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అవసరం లేకున్నా, నీటిని తోడుకోవాలనే శ్రద్ధ అక్కడి రాజకీయ నాయకులకు ఉంది. అలాగే మన వాటా నీటిని సాధించుకోవాలనే పట్టుదల జిల్లా ప్రజాప్రతినిధులకు ఉన్నప్పుడే నిర్ణీత సమయంలో నీటిని తీసుకునే ఆస్కారం ఉంది. ఆ దిశగా అటు అధికారులు, ఇటు పాలకులు ముందుకెళ్లాలని పడమటి రైతులు, ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-25T07:21:00+05:30 IST