శవాన్ని కదిలిచ్చేది లేదు

ABN , First Publish Date - 2021-02-25T05:29:51+05:30 IST

సర్పంచ్‌ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నుకోలేదంటూ బీఎన్‌కండ్రిగ మండలానికి చెందిన బుజ్జమ్మ శ్మశానం వైపు మృతుల బంధువులు వెళ్లకుండా అడ్డుకున్నారు.

శవాన్ని కదిలిచ్చేది లేదు
మృతదేహం వద్ద ముత్యాలమ్మ బంధువుల నిరీక్షణ

పొలం మీదుగా వెళ్లొద్దని అడ్డుకున్న మహిళ


బుచ్చినాయుడుకండ్రిగ, ఫిబ్రవరి 24: సర్పంచ్‌ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నుకోలేదని ఆరోపిస్తూ ఓ మహిళ శ్మశానం వైపు మృతుల బంధువులు వెళ్లకుండా అడ్డుకున్నారు. వివరాలివీ.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం కొత్తపాళెం శ్మశానానికి స్థానిక రైతుల పొలాల మీదుగానే వెళ్లాలి. కాగా, బుధవారం గ్రామానికి చెందిన వృద్ధురాలు ముత్యాలమ్మ మృతిచెందారు. దీంతో బంధువులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం రైతు బుజ్జమ్మ పొలం మీదుగా తీసుకువెళ్లే యత్నం చేయగా ఆమె అడ్డుకున్నారు. దీంతో మూడు గంటల పాటు అందరూ అక్కడే ఉండిపోయారు. గత ఏడాది సర్పంచ్‌ స్థానాలకు తొలి విడత ఈసీ నోటిఫికేషన్‌ జారీచేసింది. అప్పట్లో కొత్తపాళెం సర్పంచ్‌ స్థానానికి బుజ్జమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్తులు హామీఇచ్చారు. ఆ మేరకు రూ.10లక్షలు చెల్లించాలని కోరగా ఆమె అంగీకరించారు. అయితే కరోనా దెబ్బకు మళ్లీ నోటిఫికేషన్‌ రావడంతో వైసీపీ మద్దతుదారులు బరిలోకి దిగడంతో బుజ్జమ్మ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. దీంతో గ్రామపెద్దలు హామీ ఇచ్చి మోసం చేశారనీ, తన పొలం మీదుగా మృతదేహాన్ని తీసుకువెళ్లరాదని ఆమె తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ గణేష్‌, ఎస్‌ఐ ధర్మారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుజ్జమ్మ, ఆమె వర్గీయులకు నచ్చజెప్పి శ్మశానానికి వృద్ధురాలి మృతదేహాన్ని తరలించడంతో వివాదం సద్దుమణిగింది. 



Updated Date - 2021-02-25T05:29:51+05:30 IST